పథకాల అమలులో లబ్దిదారులకే స్వేచ్ఛనిస్తూ వ్యవస్థలో అవినీతిని క్లీన్ చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి జగన్(CM Jagan). టీడీపీ హాయంలో నేతలు డీలర్లతో కలిసి స్కామ్‌లు చేసి వారి ఇష్ట ప్రకారమే రైతులకు ట్రాక్టర్లు ఇచ్చారని విమర్శించారు. సన్న, చిన్నకారు రైతులు వ్యవసాయంలో యంత్రాలు ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం మేలు చేస్తుందన్నారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీని సీఎం జగన్ గుంటూరులో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద్భంగ ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు 175 రకాల్లో రైతులు ఏదైనా ఎంచుకోవచ్చని సూచించారు. గుంటూరులో వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించారు. 3,800 ట్రాక్టర్లను, 320 కంబైన్ హార్వెస్టర్లను, 1140 వ్యవసాయ పని ముట్లను రైతులకు అందించారు. గత ప్రభుత్వంలో వాహనం పొందాలంటే రైతుల ఇష్టానికి తావు ఉండేది కాదని.. తాము మాత్రం రైతులు కోరుకున్న కంపెనీ వాహనాలనే అందిస్తున్నామని అన్నారు. ఇందుకోసం రూ.690 కోట్ల వ్యయం చేసినట్లు వెల్లడించారు.
ఇందులో రైతుల రాయితీకి సంబంధించి రూ.175 కోట్లను ముఖ్యమంత్రి బటన్ నొక్క వారి ఖాతాల్లోకి జమ చేశారు. 40 శాతం రాయితీతో ట్రాక్టర్లు, యంత్రపరికరాలు అందిస్తున్నామన్నారు. రైతులు 10 శాతం చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించారు. మిగతా 50 శాతాన్ని తక్కువ వడ్డీతో బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తున్నట్లు వివరించారు. ప్రతి అడుగులోనూ రైతులకు తోడుగా నిలుస్తున్నామని.. విత్తనాల సరఫరా నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు సీఎం జగన్ వివరించారు. అనంతరం సీఎం స్వయంగా ట్రాక్టర్ నడిపారు.