Nidadavole Politics: సైలెంట్‌గా ఉన్న నేత సై అంటున్నారు.. ఇంతకీ అధిష్టానం ఎవరి వైపు..?

|

Jan 18, 2024 | 4:32 PM

ఆయనో మాజీ ఎమ్మెల్యే.. ఒక్కసారి కాదు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల ఓటమి అనంతరం కొంతకాలం సైలెంట్ అయ్యారు. బరిలో ఉండబోనంటూ అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి చెప్పిన ఆయన, అనక మనసు మార్చుకున్నారు. అయితే అధిష్టానం కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉందనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. దీంతో బరిలో ఎవరుంటారనే చర్చ ఆసక్తి రేపుతోంది.

Nidadavole Politics: సైలెంట్‌గా ఉన్న నేత సై అంటున్నారు.. ఇంతకీ అధిష్టానం ఎవరి వైపు..?
Telugu Desam Party
Follow us on

ఆయనో మాజీ ఎమ్మెల్యే.. ఒక్కసారి కాదు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల ఓటమి అనంతరం కొంతకాలం సైలెంట్ అయ్యారు. బరిలో ఉండబోనంటూ అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి చెప్పిన ఆయన, అనక మనసు మార్చుకున్నారు. అయితే అధిష్టానం కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉందనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. దీంతో బరిలో ఎవరుంటారనే చర్చ ఆసక్తి రేపుతోంది.

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకునే నియోజకవర్గాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు ఒకటి. 2009లో శేషారావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో సైతం మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతటి బలమైన టీడీపీ కేడర్ ఉండి కూడా 2019 ఎన్నికల్లో అక్కడ టీడీపీ ఓటమిపాలైంది. 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జి. శ్రీనివాస నాయుడు 21 వేల 600 పైచిలుకు ఓట్ల మెజారిటీతో సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుపై గెలుపొందారు.

నియోజకవర్గంలో నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మూడు మండలాలు కలిపి సుమారు రెండు లక్షల ఐదు వేల మంది ఓటర్లు ఉన్నారు. కమ్మ సామాజికవర్గ ఆధిపత్యం నియోజకవర్గంలో అధికంగా కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కుందుల సత్యనారాయణ ప్రస్తుతం టికెట్ కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో ఇద్ధరు నేతలలు నియోజకవర్గం పై ఫోకస్ పెంచారు. 2019లో సైతం కుందుల సత్యనారాయణ నిడదవోలు టిడిపి టికెట్ ను ఆశించారు. ఆ సమయంలో టీడీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లికే జై కొట్టింది. అయినా కుందుల పార్టీని వీడకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. 2019 ఓటమి అనంతరం మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

దాదాపు మూడు సంవత్సరాల పాటు టీడీపీ నాయకులు కానీ, కార్యకర్తలకు కానీ బూరుగుపల్లి అందుబాటులో లేరు. పార్టీ ఓటమికి ఆయనే కారణం అంటూ అప్పట్లో సొంత పార్టీ నేతలే బూరుగుపల్లిపై బహిరంగ విమర్శలకు చేశారు. అదేవిధంగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం బూరుగుపల్లి కృషిచేయలేదని విమర్శలు సొంత పార్టీ నేతల్లోనే ఉన్నాయి. అదేవిధంగా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు బూరుగుపల్లి సంపాదించారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. అంతేకాక పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల విషయంలోనూ బూరుగుపల్లి చిన్న చూపు చూశారని, ఆ కారణం చేతనే 2019లో నియోజకవర్గ ప్రజలు వైసీపీకి పట్టం కట్టారని భావిస్తున్నారు. అదే సమయంలో బూరుగుపల్లి బ్రదర్స్ లో టికెట్ కోసం జరిగిన ఫైట్ సైతం టీడీపీ ఓటమికి కారణమైందని ఇప్పటికీ ఆ పార్టీ నేతలు చెప్పుకుంటారు.

అయితే ఇటీవల మళ్లీ బూరుగుపల్లి యాక్టివ్ అయ్యారు. టీడీపీ – జనసేన పోత్తు నేపథ్యంలో మరొకసారి తనకు నిడదవోలు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. అధిష్టానం మాత్రం ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తుందట. ఎందుకంటే 2019 ఓటమి అనంతరం బూరుగుపల్లి సైలెంట్ అయిన సమయంలో నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు తన భుజస్కందాలపై వేసుకుని కుందుల సత్యనారాణ ముందుకు నడిపించారని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. అంతేకాక అన్నీ తానై టీడీపీ అధిష్టానం ప్రతిష్టాత్మంగా చేపట్టిన అన్ని పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళటంతో పాటు.. నియోజకవర్గంలో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావడానికి ఎంతగానో కుందుల ప్రయత్నించారనీ ఆయన వర్గం నేతలు అంటున్నారు. ఈసారి తప్పకుండా కుందులకే టికెట్ ఇవ్వాలని ఆయన వర్గం నేతలు పట్టుబడుతున్నారు. దాంతో ఇరు నేతల్లో ఎవరి వైపు టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతుందనే చర్చ జరుగుతోంది. ఇపుడు మరోసారి నిడదవోలులో బూరుగుపల్లికి అవకాశం ఇస్తే గెలవడం కష్టమేనని టీడీపీ అసమ్మతి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈసారి తప్పకుండా టికెట్ మార్చాల్సిందేనని కుందుల వర్గం పట్టుబడుతుంది. తప్పకుండా కొత్త వారిని రంగంలోకి దింపాలనే ఒత్తిడి పెరుగుతుండటంతో అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేస్తుందనే ప్రచారం జోరందుకుంది.

మరోవైపు నియోజకవర్గంలో కుందుల, బూరుగుపల్లి ఇద్దరి పైనా టీడీపీ నేతలు సర్వే చేయిస్తున్నట్లు చెబుతున్నారు. మరో వైపు నియోజకవర్గంలో ముఖ్యనేతల అభిప్రాయం మేరకు కొత్త వారికి అవకాశం ఇస్తుందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇది కుందుల, బూరుగుపల్లి ల్లో ఎవరివైపు అధిష్టానం మొగ్గు చూపుతుందో తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…