Ex Minister Narayana Arrested Live: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.. ధృవీకరించిన చిత్తూరు పోలీసులు

| Edited By: Ravi Kiran

May 10, 2022 | 7:34 PM

10th Exam Paper Leak Live Updates: టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి నారాయణ (Narayana)ను హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తరలిస్తున్నారు. ఎగ్జామ్స్ మాల్ ప్రాక్టీస్ కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ ఓ ప్రకటనలో ధృవీకరించారు.

Ex Minister Narayana Arrested Live: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.. ధృవీకరించిన చిత్తూరు పోలీసులు
AP Ex-Minister Narayana Arrest

Ex Minister Narayana Arrested Live Updates: ఏపీ టీడీపీ మాజీ మంత్రి నారాయణ (Narayana)ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఐకియా దగ్గర మాజీ మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయన్ని చిత్తూరుకు తరలిస్తున్నారు. పేపర్ లీకేజీ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే నారాయణపై పేపర్ లీకేజీ కేసుతో పాటు ల్యాండ్ పూలింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.

కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల సందర్భంగా ప్రశ్న పత్రాలు వరుసగా లీక్‌ అయ్యాయి. ఈ లీకేజీ వెనుక శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఏపీ సీఐడీ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

నారాయణ గ్రూపులో దాదాపు 300 స్కూల్స్, 300 జూనియర్ కాలేజీలు..

వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తిచేశారు. వీఆర్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేశారు. అనంతరం 1979లో నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ ను ప్రారంభించారు. నారాయణ గ్రూపులో దాదాపు 300 స్కూల్స్, 300 జూనియర్ కాలేజీలు, 8 ప్రొఫెషన్ కాలేజీలు, జేఈఈ, నీట్, యూపీఎస్సీ, సీఎస్ఈ తదితర పోటీ పరీక్షలకు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. దేశంలో నాలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నారాయణ సంస్థ.. 1995 నుంచి రాజకీయాలతో అనుబంధం పెంచుకున్నారు. చంద్రబాబునాయుడితో పరిచయం నారాయణను రాజకీయాలవైపు మళ్లించింది. సర్వేలు, వర్క్ షాప్ లు నిర్వహిస్తూ.. టీడీపీకి, ప్రభుత్వం ఏర్పడినప్పుడు చంద్రబాబుకు సేవలందిచిన నారాయణ.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో నారాయణకు మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ , పట్టణాభివృద్ధి శాఖలతో పాటు నూతన రాజధాని అమరావతి నిర్మాణంలోనూ నారాయణ కీలక పాత్ర పోషించారు.

నారాయణ అరెస్టును ఖండించిన అచ్చెన్నాయుడు

మాజీ మంత్రి నారాయణ, ఆయన సతీమణిని పోలీసులు అరెస్టు చేయడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. సీఎం జగన్ తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్ జరుగుతున్నాయని ఆరోపించారు. ఏ కేసులో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా పోలీసులు చెప్పకపోవడం జగన్ రెడ్డి అప్రజాస్వామిక పాలనకు నిదర్శనం అన్నారు. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్ లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. జగన్ అవినీతిని, విధ్వంస పాలనను ప్రశ్నించిన వారిపై వేల సంఖ్యలో అక్రమ కేసులు నమోదు చేశారని, ప్రజలు అధికారం కట్టబెట్టింది అభివృద్ధి చేయడానికి కానీ.. ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్షసాధింపు చర్యల కోసం కాదు హితవు పలికారు. ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు.

రోజురోజుకూ జగన్ పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని, రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ వైపు చెబుతుంటే.. మరోవైపు ఇదే వ్యవహారంలో నారాయణను ఏవిధంగా అరెస్ట్ చేస్తారు? రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారు అని ఆరోపణలు గుప్పించారు అచ్చెన్నాయుడు. పరీక్షల నిర్వహణలో విఫలమై ఆ నెపాన్ని నారాయణపై నెట్టారు. అక్రమ అరెస్ట్ ల పట్ల భవిష్యత్ లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

>


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 May 2022 06:38 PM (IST)

    నారాయణపై ఏయే సెక్షన్ల కింద కేసులు

    మాజీ మంత్రి నారాయణపై సెక్షన్లు 409 ఐపిసీ, 408 ఐపిసీ, 201 ఐపిసీ, 120 (బి) ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి.

    ఐపిసి సెక్షన్ 409
    పబ్లిక్ సర్వెంట్ నమ్మకాన్ని నేరపూరితంగా వమ్ము చేయడం.
    నేరం రుజువైతే.. పదేళ్ల వరకు శిక్ష, జరిమానా

    ఐపిసీ సెక్షన్ 408
    నేరపూరిత విశ్వాస ఉల్లంఘన
    ఏడేళ్ల వరకు కూడిన జైలు శిక్ష, జరిమానా

    ఐపిసీ సెక్షన్ 201
    నేరానికి సంబంధించిన సాక్ష్యం అదృశ్యం
    నేరస్థుడికి తప్పుడు సమాచారం అందించడం
    మూడేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష

    ఐపిసీ సెక్షన్ 120 (బి)
    నేరపూరిత కుట్రకు శిక్ష -మరణశిక్ష, జీవిత ఖైదు లేదా రెండేల్ల నుంచి ఎక్కువ కాలం పాటు కఠిన కారాగార శిక్ష. ఇతర నేరపూరిత కుట్రలో భాగస్వామ్యుడైన వ్యక్తి ఆరు నెలలకు మించని జైలు శిక్ష, జరిమానా

    పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ 1997
    ప్రివెన్షన్ ఆఫ్ మాల్‌ప్రాక్టీసెస్ అండ్ అన్యాయ చట్టం 1997
    సెక్షన్ 3 లేదా సెక్షన్ 4 లేదా సెక్షన్ 5 లేదా సెక్షన్ 6 లేదా సెక్షన్ 7లోని నిబంధనలు
    ఉల్లంఘిస్తే మూడు నుంచి ఏడేళ్లకు తక్కువ కాకుండా పొడిగించే జైలు శిక్ష
    జరిమానా రూ.5 వేల కంటే తక్కువ ఉండకూడదు.
    ఇది రూ. లక్ష వరకు పొడిగించవచ్చు

  • 10 May 2022 06:09 PM (IST)

    టీడీపీ మాజీ మంత్రుల అరెస్టు… ఎప్పుడు? ఎవరు?

    వైసీపీ అధికారంలోకి వచ్చాక అరెస్టైన టీడీపీ మాజీ మంత్రుల వివరాలు..

    1. 12-6-2020న ఈఎస్ఐ కేసులో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మరో ఆరుగురిని అరెస్ట్ చేసిన ఏసీబీ
    2. 3-7-2020న వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్
    3. 6-01-2021 హైదరాబాద్‌ లోని బోయిన్‌పల్లిలో కిడ్నాప్‌ కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్‌ రామ్‌ అరెస్ట్.
    4. 20.01-2021 ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై రాళ్ల దాడి కేసు. విజయనగరంలో టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అరెస్టు
    5. 28-07-2021… మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్టు. కొండపల్లి ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ జరుగుతోందంటూ ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి దేవినేని ఉమా వెళ్తున్న సమయంలో వైసీపీ-టీడీపీ కార్యకర్త ఘర్షణ. దీనికి బాధ్యుడిగా ఉమాపై కేసు
    6. 10-05-2022 టెన్త్ పేపర్స్ లీకేజ్ కేసు. మాజీ మంత్రి నారాయణ హైదరాబాద్ లో అరెస్టు

  • 10 May 2022 05:59 PM (IST)

    నారాయణ, చైతన్య విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలి.. బీజేవైఎం కార్యకర్తలు ధర్నా

    కర్నూలు: నారాయణ, చైతన్య విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డీఈఓ కార్యాలయం ఎదుట బీజేవైఎం కార్యకర్తలు ధర్నా చేపట్టారు.

    Narayana School

  • 10 May 2022 05:56 PM (IST)

    అన్నమయ్య జిల్లా పీలేరు క్రాస్ రోడ్డులో టీడీపీ శ్రేణుల ఆందోళన

    అన్నమయ్య జిల్లా పీలేరు క్రాస్ రోడ్ కు టిడిపి శ్రేణులు చేరుకున్నారు. నారాయణను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు.. పీలేరు మీదుగా చిత్తూరుకు తరలిస్తుండటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పీలేరు క్రాస్ రోడ్డులో టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు టిడిపి ఇన్ ఛార్జ్ చల్లా బాబు ఆందోళన చేపట్టారు.  నారాయణను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

  • 10 May 2022 05:53 PM (IST)

    మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు ఏపీ కాంగ్రెస్ ఖండన

    కడప: మాజీ మంత్రి నారాయణ అరెస్టును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రైవేట్ వ్యవస్థలపై కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్‌తో పాటు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తమ పదవులకు రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.  ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఆనాడు ముద్దుకృష్ణమనాయుడు తమ పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. ప్రశ్నాపత్రాలు లీకేజీ కాలేదని ప్రభుత్వం చెబుతోందని.. మరి కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. పరీక్షలను కూడా సక్రమంగా నిర్వర్తించే సత్తా ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. నారాయణ విద్యాసంస్దలే కారణం అయితే ప్రభుత్వ ఉపాద్యాయులను ఎందుకు సస్పెండ్ చేశారని తులసిరెడ్డి ప్రశ్నించారు.

  • 10 May 2022 05:05 PM (IST)

    నారాయణ అరెస్టు రాజకీయ కక్ష సాధింపే.. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపణ

    తాడేపల్లి: తన ఆనందం కోసం.. రాజకీయ కక్షసాధింపులో భాగంగా మాజీ మంత్రి నారాయణను సీఎం జగన్ అరెస్ట్ చేయించారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. దీంతో ముఖ్యమంత్రి ప్రతిపక్షానికి భయపడుతున్నారని తేలిపోయిందన్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం రోజురోజుకీ పెరిగిపోతోందన్నారు. తన ప్రభుత్వానికి చేటుచేస్తున్న మంత్రులను కట్టడిచేయలేని తన డొల్లతనం ప్రజలకు తెలియకూడదనే జగన్ రెడ్డి నారాయణను అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఒక వ్యవస్థలో తప్పు జరిగిందని, సదరు వ్యవస్థల నిర్వాహకుడైన నారాయణను అరెస్ట్ చేయడం విడ్డూరమన్నారు. పేపర్ లీకేజ్ ఘటనల్లో సంబంధంలేకుండా మాట్లాడిన మంత్రి బొత్సను తొలుత ప్రభుత్వం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బొత్సను అరెస్ట్ చేయించే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఉందా? అని అశోక్ బాబు ప్రశ్నించారు.

  • 10 May 2022 04:59 PM (IST)

    నారాయణ అరెస్ట్ వ్యవహారం.. చిత్తూరు ఎస్పీ ప్రెస్ మీట్

    మాజీ మంత్రి నారాయణ అరెస్టు వ్యవహారంపై ఈ సాయంత్రం 5.30 గం.లకు చిత్తూరు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. నారాయణ అరెస్టుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెళ్లడించనున్నారు.

    హైదరాబాద్‌లో నారాయణను అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు.. చిత్తూరుకు తరలిస్తున్నారు. నారాయణ అరెస్టును ధృవీకరించిన జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి.. ఎగ్జామ్ మాల్ ప్రక్టీస్‌ కేసుకు సంబంధించి మాజీ మంత్రిని అరెస్టు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి మేజిస్ట్రేట్ ముందు నారాయణను పోలీసులు హాజరు పరచనున్నారు.

  • 10 May 2022 04:57 PM (IST)

    నారాయణ విద్యాసంస్థల అండర్‌లోనే మాల్‌ప్రాక్టీస్ః సజ్జల

    నారాయణ విద్యాసంస్థల అండర్‌లోనే మాల్‌ప్రాక్టీస్‌ జరిగిందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ర్యాంకుల కోసం అడ్డదారుల తొక్కిన చరిత్ర నారాయణ, చైతన్య సంస్థల్లోనే మొదలైందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు, మేం సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు సజ్జల.

  • 10 May 2022 04:47 PM (IST)

    కడప మీదుగా చిత్తూరుకు నారాయణ తరలింపు..

    కడప: పాలెంపల్లి టోల్ గేట్ వద్దకు నారాయణ విద్యాసంస్దల ప్రతినిధులు, టిడిపి కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. మాజీ మంత్రి నారాయణను కడప మీదుగా ఏపీ సీఐడీ పోలీసులు చిత్తూరు తీసుకెళుతున్నారు.

    Narayana

  • 10 May 2022 04:21 PM (IST)

    నిందితులు ఎవరైనా అరెస్టు అవుతారు.. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు

    పదో తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలోనే మాజీ మంత్రి నారాయణ అరెస్టు అయ్యారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో 60 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు గుర్తుచేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రమేయమున్న నిందితులు ఎవరైనా అరెస్టు అవుతారని అన్నారు. వారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టంచేశారు.

  • 10 May 2022 03:49 PM (IST)

    నారాయణ తరలింపుపై కొనసాగుతున్న ఉత్కంఠ

    నారాయణ అరెస్ట్ ను నిరసిస్తూ కర్నూలు టోల్ ప్లాజా వద్దకు నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ నేతలు భారీ చేరుకున్నారు. వారిని అడ్డుకున్న పోలీసులు టోల్ ప్లాజా దగ్గర ఎక్కువ మంది గుమికూడకుండా దూరంగా పంపించివేశారు. మరోవైపు ఇంత వరకు అలంపూర్‌ చెక్‌పోస్టుకు పోలీసుల వాహరం చేరుకోలేదు. మరో రూట్‌లో నారాయణను తరలించి ఉంటారనే అనుమానం వక్తమవుతోంది. కాగా, సాయంత్రంలోపు చిత్తూరుకు నారాయణను తీసుకొస్తామంటున్నారు పోలీసులు. ఈ రాత్రికి చిత్తూరు జడ్జి ముందు నారాయణను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

  • 10 May 2022 03:44 PM (IST)

    ఈ కేసును లీగల్‌గా ఎదుర్కొంటాంః నారాయణ కుటుంబసభ్యులు.

    నారాయణ విద్యాసంస్థల చైర్మన్‌ నారాయణను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు చిత్తూరుకు తరలిస్తున్నారు. మరికాసేపట్లో చిత్తూరుకు చేరుకుంటారు. అయితే షాద్‌నగర్‌లో నారాయణ భార్యను వదిలిపెట్టారు. దీంతో లోథాలో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు రమాదేవి. ఈ కేసును లీగల్‌గానే ఎదుర్కొంటామంటున్నారు నారాయణ కుటుంబసభ్యులు.

  • 10 May 2022 03:41 PM (IST)

    అక్రమాలకు పాల్పడితే అరెస్టు చేయడం తప్పాః మంత్రి కారుమూరి

    విద్యాసంస్థల పరపతి పెంచుకునేందుకు అక్రమాలకు పాల్పడిన నారాయణను అరెస్టు చేయడం తప్ప అని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. నారాయణ అరెస్టును రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని అన్నారు. రాజధాని భూముల వ్యవహారంలో A1గా ఉన్న చంద్రబాబుకు కూడా నోటీసులిస్తారని కారుమూరి స్పష్టం చేశారు.

  • 10 May 2022 03:30 PM (IST)

    మాజీ మంత్రి నారాయణ అరెస్టు.. చిత్తూరు పోలీసులు ధృవీకరణ

    చిత్తూరు: టీడీపీ నేత,  మాజీ మంత్రి నారాయణ అరెస్టును చిత్తూరు పోలీసులు ధృవీకరించారు. 10వ తరగతి ప్రశ్నా పత్రాల మాల్ ప్రాక్టీసు కేసులో నారాయణను అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్పి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

  • 10 May 2022 02:58 PM (IST)

    పరీక్షల నిర్వహణ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అరెస్ట్ః చంద్రబాబు

    నారాయణ అరెస్ట్‌ను ఖండించారు చంద్రబాబు . నారాయణ అరెస్ట్ పూర్తిగా కక్ష పూరితమని..టెన్త్ పరీక్షల నిర్వహణ వైఫల్యాలను..కప్పిపుచ్చుకునేందుకే అరెస్ట్‌ చేశారన్నారు. మాస్‌ కాపీయింగ్‌, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు..నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని ప్రశ్నించారు చంద్రబాబు.

  • 10 May 2022 02:57 PM (IST)

    ప్రజల దృష్టి మళ్లించేందుకే అరెస్టులుః చెంగల్‌రాయుడు

    రాష్ట్రంలో వెలుగు చూస్తున్న అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసిందని టీడీపీ సీనియర్‌ నేత చంగల్‌రాయుడు ఆరోపించారు. తప్పుడు కేసులతో విద్యాసంస్థలపై అభాండాలు వేసే ప్రయత్నం ఇదని అన్నారు. ఎక్కడా లీకేజీ జరగలేదని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పిన విషయాన్ని చంగల్‌కాయుడు ఆరోపించారు. ఇది ఒక సామాజికవర్గంపై జరుగుతున్న దాడి అని తెలిపారు.

  • 10 May 2022 02:54 PM (IST)

    తగిన ఆధారాలతోనే నారాయణ అరెస్టు: మంత్రి అంబటి

    మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ అయ్యాడు అందులో చెప్పేదేముందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అనేక ఆందోళనలకు టీడీపీ నేతలే సూత్రధారులని అన్నారు. పదో తరగతి పేపర్ లీకేజీలో నారాయణ కాలేజీ కీలకంగా వుందన్నారు. దీన్ని రాజకీయ కక్షసాధింపుగా చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని.. మరి పేపర్ లీక్ చేస్తే చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. పేపర్ లీక్ చేసి నారాయణ విద్యా సంస్థ నెంబర్ -1 సాధిస్తోందని ఆరోపించారు. తగిన సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి కాబట్టే నారాయణను అరెస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అరెస్టుపై ఏమైనా ఉంటే టీడీపీ వారు కోర్టులకు వెళ్లొచ్చుని.. అంతే కానీ సీఎం జగన్ మీద పడి ఏడవకండని అంబటి వ్యాఖ్యానించారు.

  • 10 May 2022 02:52 PM (IST)

    అంతలోనే మారిపోయిన కేసు

    ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్‌, లింగమనేని వెంకట సూర్యరాజశేఖర్, ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్ట్స్‌, రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ డైరెక్టర్‌ అంజీకుమార్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతనెల 27న  మంగళగిరి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్‌ 120బి, 420, 34, 35, 36, 37, 166, 167, 217 కింద సీఐడీ పోలీసులు వారిపై సోమవారం కేసు నమోదు చేశారు.

  • 10 May 2022 02:50 PM (IST)

    తప్పు చేస్తే ఎవరినీ వదిలేది లేదుః బొత్స

    నారాయణ అరెస్టుపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పదించారు. ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఉన్న అందరినీ అరెస్టు చేస్తారని చెప్పారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలేది లేదన్నారు. అక్రమాలు జరగకపోతే ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీలో 60 మందిని అరెస్టు చేసినట్లు బొత్స చెప్పారు.

     

  • 10 May 2022 02:48 PM (IST)

    సమస్యలు పరిష్కరించకుండా.. ప్రజల దృష్టి మరల్చేందుకే అరెస్టు: బీదా రవింద్రం

    నెల్లూరు: ప్రశ్నా పత్రాల లీకేజీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మాజీ మంత్రి నారాయణను ప్రభుత్వం అరెస్టు చేయించిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర ఆరోపించారు. ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించకుండా.. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం సీఎం జగన్‌కు అలవాటుగా మారిందన్నారు. గతంలో టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసి ఏమీ నిరూపించ లేకపోయారని.. మాజీ మంత్రి నారాయణపై ఆరోపణలను కూడా నిరూపించలేరని అన్నారు.గత మూడేళ్ళుగా జగన్ సర్కారు వ్యవహారం ఇలాగే ఉందని.. టీడీపీ నేతలపై ఒక్క ఆరోపణను కూడా జగన్ తన పాలనలో నిరూపించలేదని అన్నారు.

    కొన్ని మీడియా సంస్థలు మాత్రం పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజ్ ని నారాయణకు అపాదించడం సరికాదన్నారు. ఐఐటి..ఐఐఎం లతో పాటు మెడికల్ సీట్లలో నారాయణ విద్యా సంస్థలు రాణిస్తున్నాయని.. అందుకే కక్ష్య గట్టి నారాయణను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం తగదన్నారు.

  • 10 May 2022 02:44 PM (IST)

    నారాయణ కాలేజీ నుంచి తెలుగు పేపర్ లీక్

    నారాయణకు చెందిన స్కూల్‌ నుంచి పేపర్ల లీకేజీ జరిగినట్లు చిత్తూరు పోలీసులు ధృవీకరించారు. తిరుపతిలోని ఎస్వీ బ్రాంచ్‌ నారాయణ కాలేజీ నుంచి గిరిధర్‌ అనే టీచర్‌ తెలుగు ప్రశ్నా పత్రాన్ని వాట్సప్‌ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు విచారణలో భాగంగా నారాయణను అరెస్ట్‌ చేశారు.

  • 10 May 2022 02:42 PM (IST)

    కొడుకు వర్ధంతి కార్యక్రమంలో ఉండగా అరెస్ట్ చేయడమేంటి? – బండారు

    నారాయణ అరెస్ట్‌ను తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తీవ్రంగా ఖండించారు. కొడుకు వర్ధంతి కార్యక్రమంలో ఉండగా అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. మే 10 తన ఒక్కగానొక్క కొడుకు నిషిత్ నారాయణ చనిపోయిన రోజు.. ఆ వర్ధంతి ఏర్పాట్లలో ఉండగా ఎటువంటి సంమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు.

  • 10 May 2022 02:37 PM (IST)

    నారాయణ సతీమణిని వదిలేసిన పోలీసులు

    కాగా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న నారాయణ సతీమణి రమాదేవిని షాద్‌నగర్ దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం ఆమె నేరుగా లోధాలో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు.

  • 10 May 2022 02:00 PM (IST)

    బొత్స సత్యనారాయణను అరెస్ట్ చేసే దమ్ముందా

    నారాయణ అరెస్టును ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఖండించారు. కేవలం ప్రభుత్వం పై వ్యతిరేకత నుండి ప్రజలను మరల్చేందుకు నారాయణ అక్రమ అరెస్ట్ చేశారని ఆరోపించారు. కాపు,బలిజ వ్యాపారవేత్తలను అణగ దొక్కెందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పేపర్ లీకేజీ జరగలేదన్న మంత్రి బొత్స సత్యనారాయణ ను అరెస్ట్ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా అంటూ ప్రశ్నించారు.

  • 10 May 2022 01:58 PM (IST)

    టెన్త్‌ ప్రశ్నాపత్రాల లీకేజీని ఏపీ ప్రభుత్వం సీరియస్‌

    టెన్త్‌ ప్రశ్నాపత్రాల లీకేజీని ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. నారాయణ విద్యాసంస్థల నుంచే పేపర్లు లీకైనట్టు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఇటీవల ఓ బహిరంగంగా అన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ వ్యవహరంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

  • 10 May 2022 01:57 PM (IST)

    పేపర్‌ లీకేజీ అంశంపై చిత్తూరు పోలీసులు దర్యాప్తు

    పేపర్‌ లీకేజీ అంశంలో చిత్తూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నారాయణ కాలేజీలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న గిరిధర్‌ను అరెస్ట్‌ చేశారు. నారాయణ సిబ్బంది వినియోగించిన ఫోన్లలో కీలక డేటాను సేకరించారు. ఎవరి ఆదేశాల మేరకు ఈ వ్యవహారాన్ని నడిపారన్న దానిపై కూపీ లాగారు.

  • 10 May 2022 01:55 PM (IST)

    నారాయణతో పాటు ఆయన సతీమణి

    ఈ కేసులోనే నారాయణను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. హైదరాబాద్‌లోని ఐకియా దగ్గర కారులో వెళుతున్న నారాయణను అటు నుంచి అటే తిరుపతికి తీసుకెళ్తున్నారు. నారాయణతోపాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు.

  • 10 May 2022 01:52 PM (IST)

    నారాయణ సిబ్బందే మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు.. నారాయణ విద్యాసంస్థలపై ప్రధాన ఆరోపణ ఏంటంటే..

    నారాయణ విద్యాసంస్థలు టెన్త్‌ పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్‌ను ఫొటో తీసి వాట్సాప్‌లో పంపారని, వాటికి ఆన్సర్లు తమ విద్యార్థులకు చేరేలా కుట్ర పన్నారన్నది ఆరోపణ ఉంది. తమ సంస్థలకు ర్యాంకుల కోసమే నారాయణ సిబ్బంది మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని గుర్తించారు.

  • 10 May 2022 01:48 PM (IST)

    కక్ష సాధింపు కోసమే అరెస్టు- దేవినేని ఉమ

    నారాయణ అరెస్టును టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమ ఖండించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఈ అరెస్టు అని ఆరోపించారు. వైసీపీ సర్కార్ పరీక్షల నిర్వహణలో విఫలమైందని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు.

  • 10 May 2022 01:46 PM (IST)

    టోల్‌గేటు వద్దకు నారాయణ విద్యాసంస్థల టీచర్లు, సిబ్బంది

    నారాయణ అరెస్టు సందర్భంగా పుల్లూరు చెక్ పోస్టుకు నారాయణ విద్యాసంస్థల టీచర్లు, సిబ్బంది, అభిమానులు భారీగా చేరుకున్నారు. టోల్ గేట్ దగ్గర భారీగా జనాలు తరలివచ్చారు. టోల్ గేట్ వద్ద ఉన్న జన సమూహాన్ని పంపిస్తున్న తెలంగాణ పోలీసులు.

  • 10 May 2022 01:40 PM (IST)

    నారాయణ, సతీమణిని ఏపీకి తరలింపు

    మాజీ మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు..నారాయణ సొంత బెంజ్ కారులోనే ఏపీకి తలిస్తున్నారు పోలీసులు

  • 10 May 2022 01:39 PM (IST)

    విద్యాశాఖ మంత్రి బోత్స సీఎంతో భేటీ

    మాజీ మంత్రి నారాయన అరెస్టుపై విద్యాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వచ్చారు. కొద్ది సేపట్లో ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ కానున్నారు.

  • 10 May 2022 01:35 PM (IST)

    శ్రీచైతన్య విద్యాసంస్దల గుర్తింపును రద్దు చేయాలంటూ ధర్నా

    టెన్త్‌ పేపర్‌ లీకేజి వ్యవహారంలో నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్దల గుర్తింపును రద్దు చేయాలంటూ ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట బీజెవైయం కార్యకర్తల ధర్నాకు దిగారు. సంస్థలపై చర్యలు తీసుసుకోవాలని డిమాండ్‌ చేశారు.

  • 10 May 2022 01:33 PM (IST)

    ఇది అక్రమ అరెస్టు: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

    నారాయణది అక్రమ అరెస్టు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీఎం జగన్ తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఏ కేసులో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా పోలీసులు చెప్పకపోవడం జగన్ అప్రజాస్వామిక పాలనకు నిదర్శనం అని అన్నారు.

  • 10 May 2022 01:30 PM (IST)

    మాజీ మంత్రి నారాయణ అరెస్టును ఖండించిన బుద్ధ వెంకన్న

    మాజీ మంత్రి నారాయణ అరెస్టును టీడీపీ సీనియర్‌ నేత బుద్ద వెంకన్న ఖండించారు. ఇది ముమ్మాటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్ర అని ఆరోపించారు. టీడీపీలో మంత్రిగా పని చేసిన నారాయణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

  • 10 May 2022 01:28 PM (IST)

    నారాయణపై కేసులు

    నారాయణపై టెన్త్‌ పరీక్షల పేపర్‌ లీకేజీతో పాటు ల్యాండ్‌ పూలింగ్‌ కేసు నమోదు చేశారు పోలీసులు.

  • 10 May 2022 01:25 PM (IST)

    పోలీసుల అదుపులో నారాయణతో పాటు సతీమణి

    మాజీ మంత్రి నారాయణతో పాటు ఆయన సతీమణినిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Follow us on