ఏపీలో పంచాయతీ ఎన్నికలు సవ్యంగా జరిగేందుకు ఎస్‌ఈసీ నిన్న ఈవాచ్ యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది. అటు ప్రభుత్వానికి ఇటు ఎన్నికల కమిషన్‌కు మధ్య వార్ కొనసాగుతోంది. ఎన్నికల ఫిర్యాదు కోసం ఎస్‌ఈసీ ఆవిష్కరించిన యాప్ వివాదాలు రేపుతోంది. పోటీగా వైసీపీ కూడా మరో యాప్‌ను ఆవిష్కరించింది. అయితే ఎస్‌ఈసీ ఆవిష్కరించిన ఈవాచ్ యాప్‌ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఫిబ్రవరి 9వ తేదీ వరకు యాప్‌ను వినియోగించవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 9కి వాయిదా వేసింది. కాగా, పోలింగ్ అక్రమాలను అరికట్టేందుకు ఈవాచ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఎస్‌ఈసీ చెబుతుండగా, అధికార పార్టీకి నష్టం కలిగించేందుకు యాప్‌ను తెచ్చారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.