
ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్, ఇంకొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 2-3 గంటల్లో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు పడే సమయంలో గంటకు 60-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
అటు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర ప్రజలు నిలబడవద్దని అధికారులు చెప్పారు.