ఆంధ్రప్రదేశ్ పంచాయతీ మూడో విడత ఎన్నికలు, పలు చోట్ల ఉద్రిక్తతలు, అంతరాయాలు, బహిష్కరణలు, చెదురుమదురు ఘటనలు

|

Feb 17, 2021 | 12:47 PM

AP Local Elections Phase 3 : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత ఎన్నికలు ఈ ఉదయం మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 160 మండలాల్లోని..

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ మూడో విడత ఎన్నికలు, పలు చోట్ల ఉద్రిక్తతలు, అంతరాయాలు, బహిష్కరణలు, చెదురుమదురు ఘటనలు
AP Panchayat Elections
Follow us on

AP Local Elections Phase 3 : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత ఎన్నికలు ఈ ఉదయం మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 160 మండలాల్లోని 26,851 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 6.30 గంటలకు పోలింగ్‌ మొదలైంది. ఈ పోటీలో 51, 369 మంది అభ్యర్థుల భవితవ్వం రాత్రికి తేలనుంది. మూడో విడతలో మొత్తంగా 3,321 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్‌ జారీ కాగా, అందులో 579 సర్పంచ్‌ పదవులకు ఎన్నికగ్రీవమయ్యాయి. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది.

అనంతపురం డివిజన్‌ పరిధిలోని 19 మండలాల్లో 11.30 గంటల వరకు 61.25 శాతం పోలింగ్‌ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మఠం పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఓటరు స్లిప్పులతో పాటు గుర్తు ముద్రించిన స్లిప్పులు పంపిణీ చేయడాన్ని గుర్తించి వారిని అడ్డుకున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు మినహా పోలింగ్‌ సజావుగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10.30 గంటలకు 49.29 శాతం పోలింగ్‌ నమోదైంది.

పోలింగ్‌ కేంద్రాల వద్ద మానవత దృక్పథంలో వ్యవహించేలా ఆదేశాలు ఇచ్చారు విశాఖ జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు. వృద్ధులు, వికలాంగులకు దగ్గరుండి సేవలు అందించాలన్నారు. మూడో విడతలో168 కేంద్రాలను సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించామని, పోలింగ్‌ తర్వాత ఎవరైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగులలో పోలింగ్‌ను అధికారులు నిలిపివేశారు. అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో 12,13 వార్డుల్లో పోలింగ్‌ నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈనెల 21న రెండు వార్డులకు పోలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు.

విశాఖ పట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ఏజన్సీలో టెన్షన్‌.. టెన్షన్‌.. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏజన్సీలో అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. విశాఖలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెన్నలపాలంలో అరకు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ గొట్టేటి మాధవి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం కొత్తపల్లి పోలింగ్ కేంద్రంలో దైవకృపావతి అనే అధికారికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ప్రకాశం జిల్లా నరిశెట్టిపాలెం గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించే వరకూ ఎన్నికల్లో పాల్గొనేది లేదంటూ తేల్చి చెప్పారు. సర్పంచ్ సహా 14 వార్డుల్లో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో ఓటర్ల నుంచి బ్యాలెట్ పత్రాలు లాక్కుంటున్నారని ఓ వర్గం ఆరోపణ చేస్తోంది. బ్యాలెట్ పత్రాలు లాక్కొని ఓట్లు వేసుకుంటున్నారని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి పరిటాల సునీత ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదుల చేశారు.

శ్రీకాకుళం జిల్లా పొలకొండ మండలం అంపిలి సర్పంచ్‌ అభ్యర్థిని పోలీసులు గృహ నిర్భందంలో ఉంచారు. పాత కేసుల నేపథ్యంలోనే సర్పంచ్‌ అభ్యర్థిని పోలీసులు నిర్భంధించినట్లు తెలుస్తోంది. అయితే సర్పంచ్‌ అభ్యర్థి పోలింగ్‌ కేంద్రంలోనే ఉన్నారని మరో ప్రత్యర్థి వర్గం ఆందోళన చేస్తోంది. మచిలీపట్నం నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఆర్డీవో ఖాజావలి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని సమస్యాత్మకమైన పోలింగ్ బూత్‌లను జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు పరిశీలిస్తున్నారు.

అనంతపురం జిల్లా ఉరవకొండలో పోలింగ్‌ను వాయిదా వేస్తూ అధికారులు అర్థరాత్రి తర్వాత నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకున్నా బ్యాలెట్‌ పత్రంలో గుర్తు కేటాయించారు. దీంతో ఉరవకొండలోని మూడో వార్డు ఎన్నికను ఆలస్యంగా వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగులలో బ్యాలెట్‌ పత్రాల్లో తప్పులు దొర్లాయి. ఇద్దరు అభ్యర్థులకు ఓకే గుర్తు ఉండడంతో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. దీంతో మాడగులలోని 12,13 వార్డుల్లో పోలింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఈ నెల 21న తిరిగి పోలింగ్‌ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.

శ్రీకాకుళం, పాలకొండ, విజయనగరం, పాడేరు, రంపచోడవరం, ఎటపాక, జంగారెడ్డి గూడెం, ఏలూరు, కుక్కునూరు, మచిలీ పట్నం, గుజరాల, కందుకూరు, గూడురు, నాయుడు పేట, ఆదోని, కర్నూలు, అనంతపురం, మదనపల్లె, రాజంపేట, కడప రెవెన్యూ డివిజన్లలో పంచాయతీ ఎన్నికల మూడో విడదల పోలింగ్‌ కొనసాగుతోంది. మూడో విడత పోలింగ్‌లో మొత్తం 55.75 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం మొత్తం 26,851 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Read also : 2 లక్షల 50 వేలకు బేరం, భీమవరంలో రొయ్యల వ్యాపారి కోదండరామారావు కిడ్నాప్, హత్య కేసులో వీడిన మిస్టరీ