AP New Districts: నంద్యాల కొత్త జిల్లా ఆవిర్భావం వివాదాలతో మొదలైయింది. మొదటి రోజే జిల్లా పాలనాధికారి జిలానీపై స్థానిక ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. నంద్యాల జిల్లా కలెక్టర్ భవన ప్రారంభోత్సవ శిలాఫలకంలో ఎమ్మెల్యేల పేర్లు లేకపోవడమేంటని కలెక్టర్ తీరుపై భగ్గుమన్నారు. ఎమ్మెల్యేలకే ఇలా జరిగితే ఇతరుల పరిస్థితేంటి? అని మీడియా ముందే కలెక్టర్‌ను నిలదీశారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా పరిధిలో నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, డోన్, బనగానపల్లె నియోజకవర్గాలున్నాయి. వీటిలో డోన్ నియోజకవర్గానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా జిల్లా ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటుచేసిన శిలా ఫలకంపై మంత్రి పేరుతో పాటు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికిశోర్ రెడ్డి పేర్లు మాత్రమే ఉన్నాయి.
కాగా శిలాఫలకంపై తమ పేర్లు లేవన్న విషయాన్ని గ్రహించిన ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, బనగానపల్లె ఎమ్మెల్యేలు బ్రిజేంద్ర రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, అర్థర్, కాటసాని రామిరెడ్డిలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. జిల్లా ప్రారంభోత్సవానికి ఆహ్వానం పంపిన శిలాఫలకం విషయంలో ప్రొటోకాల్ నిబంధనలు ఎందుకు పాటించలేదని కలెక్టర్‌ను నిలదీశారు. కాగా ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా ప్రశ్నించడంతో కలెక్టర్ జిలానీ నీళ్లు నమిలారు. ఈ విషయంపై విచారణ చేయిస్తామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు శాంతించారు.
Also Read: Credit Card: క్రెడిట్ కార్డును.. డెబిట్ కార్డులా వాడుతున్నారా? అయితే చిక్కులు తప్పవు!
Knuckling Fingers: తరుచుగా వేళ్లను విరుస్తున్నారా.. అయితే, ఈ సమ్యసలు వచ్చే అవకాశం..