అధికారపార్టీకి జైకొట్టిన పట్టణవాసులు.. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం.. అన్ని జిల్లాలోనూ క్లీన్‌స్వీప్..!

|

Mar 14, 2021 | 2:06 PM

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ సరికొత్త రికార్డ్‌ సృష్టిస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా పయనిస్తోంది.

అధికారపార్టీకి జైకొట్టిన పట్టణవాసులు.. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం.. అన్ని జిల్లాలోనూ క్లీన్‌స్వీప్..!
Ap Municipal Elections Results 2021 Ysrcp Leading In Municipalites Copy
Follow us on

AP municipal elections results 2021 : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ సరికొత్త రికార్డ్‌ సృష్టిస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా పయనిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది. ఫ్యాన్‌ దూకుడుకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు విలవిలలాడాయి. ఇప్పటివరకు 6 కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. చిత్తూరు, తిరుపతి, కడప, ఒంగోలు, కర్నూలు, గుంటూరు కార్పొరేషన్లలో విజయం సాధించింది. మిగతా కార్పొరేషన్లు, 70కి పైగా మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్‌సీపీ పాగా వేసింది.

ప్రాంతమేదైనా అదే విజయం… ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు అదే ఫలితం. ఎక్కడా ఫ్యాన్ స్పీడ్ తగ్గలేదు. సైకిల్ స్పీడు పెరగలేదు. కొన్నిచోట్ల గ్లాస్ గలగలమన్నా అదేమంతా ప్రభావం చూపలేకపోయింది. కమలం పత్తా లేకుండా పోయింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాల్లోనూ ఆధిక్యం కొనసాగడం విశేషం. దీంతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ హవా కొనసాగింది. ఇచ్ఛాపురం, పలాస, పాలకొండ గ్రాండ్‌ విక్టరీ సాధించింది అధికార పార్టీ. మూడు మున్సిపాలిటీల్లో మూడింటిపై కూడా వైసీపీ జెండా రెపరెపలాడింది.

విజయనగరంలోనూ సేమ్‌ టు సేమ్‌ సీన్. జిల్లా మారిందే కానీ విన్నింగ్ పార్టీ పేరు మారలేదు. నాలుగుకి నాలుగు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. నెల్లిమర్లలో 20 వార్డులకు 12 అధికార పార్టీ అభ్యర్థులు గెలుచుకోగా… ఆరింటిలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. రెండింటిలో వైసీపీ రెబల్స్‌ విజయం సాధించారు.

విశాఖ జిల్లాలో కీలకమైన విశాఖ కార్పొరేషన్ ఇంకా రావాల్సి ఉంది. దీనికి ఇంకా సమయం పట్టే ఛాన్స్‌ ఉంది. యలమంచిలిలో వైసీపీ సత్తా చాటింది. ఇంకా మిగిలిన మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 10 మున్సిపాలిటీలు ఉంటే రెండింటిలై రిజల్స్ క్లియర్‌గా ఉంది. ఆ రెండు స్థానాల్లోనూ వైసీపీ ఎగరేసుకుపోయంది. తుని, రామచంద్రాపురం, అమలాపురంలో ఆ పార్టీ విజయం సాధించింది. మిగిలిన ప్రాంతాల్లోనూ చాలా చోట్ల వైసీపీ ముందంజలో ఉంది. అమలాపురం మున్సిపాలిటీ లో వైసీపీ 19 గెలుచుకోగా జనసేన 6, టీడీపీ4, ఇతరులు ఒకటి గెలుచుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీల్లో రెండింటిని వైసీపీ గెలుచుకుంది. నిడదవోలు, కొవ్వూరులో ఫ్యాన్ గాలి వీచింది.

కృష్ణాజిల్లాలో కౌంటింగ్ ఆలస్యంగా సాగుతోంది. మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరుగుతోంది. గుంటూరు జిల్లాలో మరోసారి వైసీపీ సత్తా చాటుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ… అదే స్పీడ్ మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగింది. 7 మున్సిపాలిటీల్లో అన్నింటినీ వైసీపీ కైవసం చేసుకుంది. రేపల్లె, తెనాలి,సత్తెనపల్లి, వినుకొండ మున్సిపాలిటీలు వైసీపీ కైవసం చేసుకుంది. కాగా, మాచర్ల, పిడుగురాళ్లలో ఇప్పటికే వైసీపీ ఏకగ్రీవంగా తన ఖాతాలో చేసుకుంది.

ప్రకాశం జిల్లాలో అదే ఫలితం.. జిల్లా మొత్తాన్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆరు మున్సిపాలిటీలకు ఆరింటినీ వైసీపీ గెలుచుకుంది. చీరాలలో 13 మంది స్వతంత్రులు గెలిచారు. ఇందులో 10 మంది ఆమంచి వర్గీయులు ఉన్నారు. ఇక్కడ మొత్తం 33 వార్డులు ఉన్నాయి. 19 వార్డుల్లో గెలిచిన వైసీపీ ఎవరి సాయం లేకుండానే మున్సిపాలిటీ ఛైర్మన్‌ పదవి హస్తగతం చేసుకుంది.

ఇక, నెల్లూరు జిల్లా కూడా ఎలాంటి మార్పు లేదు. వైసీపీది అదే జోరు… బ్రేకుల్లోకుండా దూసుకెళ్లింది. నాలుగింటికి నాలుగు మున్సిపాలిటీల్లోనూ అధికార పార్టీ విజయ ఢంకా మోగించింది. సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, ఆత్మకూరులో వైసీపీ దుమ్మురేపింది. నాయుడుపేట మున్సిపాలిటీలో 25 స్థానాల్లో వైసీపీ-23, టీడీపీ-1, బీజేపీ-1 కైవసం చేసుకున్నాయి.

అనంతపురం జిల్లాలో 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక్క తాడిపత్రి మినహా అన్ని చోట్ల వైసీపీ తన ఆధిపత్యం చూపింది. ధర్మవరం, రాయదుర్గం, కల్యాణదుర్గం, మడకశిరను వైసీపీ చుట్టేసింది. తాడిపత్రి 36 వార్డుల్లో టీడీపీ-19, వైసీపీ-15, ఇతరులు-2 గెలుచుకున్నారు. 34 వార్డులో టాస్‌ ద్వారా వైసీపీ అభ్యర్థి విజయాన్ని అధికారులు ఖరారు చేశారు. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూరంలో వైసీపీ జెండా ఎగిరింది. వైసీపీ-29 చోట్ల గెలిస్తే… టీడీపీ మూడు ప్రాంతాల్లోనే గెలిచింది. ఇక్కడ ఎంఐఎం నుంచి ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు.

కర్నూలు జిల్లాను కూడా వైసీపీ విక్టరీ సునామీ తాకింది. 8 మున్సిపాలిటీల్లో నాలుగింటిని వైసీపీ తన అకౌంట్‌లో వేసుకుంది. ఎమ్మిగనూరు, డోన్‌, గూడురు, ఆత్మకూరులో ఫ్యాన్ గాలి కొనసాగింది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ దూకుడు కొనసాగినా… మైదుకూరులో మాత్రం టీడీపీ గెలుచుకుంది. పులివెందుల, బద్వేల్, రాయచోటి, ఎర్రగుంట్లలోనూ వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. మైదుకూరులో 24 వార్డులకు టీడీపీ 12… వైసీపీ11… జనసేన ఒక చోట గెలిచాయి.

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనూ వైసీపీ ప్రభంజనం కొనసాగింది. మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరులో అధికార పార్టీ సత్తా చాటింది.