Amaravati: అమరావతి రాజధాని ఇష్యూ.. వివాదాస్పదంగా మారిన మంత్రి బొత్స హాట్ కామెంట్స్.. ఆయనేమన్నారంటే..

|

Sep 26, 2022 | 7:42 AM

Amaravati: అమరావతి రాజధాని ఇష్యూపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన హాట్‌ కామెంట్స్ వివాదాస్పదంగా మారుతున్నాయి. క్యాపిటల్‌ పేరుతో రైతులు చేస్తున్న యాత్రను..

Amaravati: అమరావతి రాజధాని ఇష్యూ.. వివాదాస్పదంగా మారిన మంత్రి బొత్స హాట్ కామెంట్స్.. ఆయనేమన్నారంటే..
Botsa Satyanarayana
Follow us on

Amaravati: అమరావతి రాజధాని ఇష్యూపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన హాట్‌ కామెంట్స్ వివాదాస్పదంగా మారుతున్నాయి. క్యాపిటల్‌ పేరుతో రైతులు చేస్తున్న యాత్రను అడ్డుకోవడం పెద్ద పని కాదని, 5నిమిషాలు చాలని ఘాటుగా స్పందించారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఇదే ఇష్యూని మేనిఫెస్టోలో పెట్టి పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్ చేశారు సీపీఐ నేత నారాయణ. ఇక విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ రాజధాని రావడం వల్ల అభివృద్ధి పెరుగుతుందంటున్నారు మంత్రి రోజా.

ఏపీలో రాజధాని ఇష్యూ రగులుతూనే ఉంది. ఇప్పటికే అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ.. డిమాండ్‌ చేస్తూ రైతులు చేస్తున్న యాత్రపైపై అనుకూల, ప్రతికూల కామెంట్స్‌ వస్తూనే ఉన్నాయి. ఈ సమయంలోనే విశాఖలో అధికార వికేంద్రీకరణపై చర్చించేందుకు రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. జెండాలు లేకుండా రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించడం సంతోషకరమన్నారు పలువురు మేధావులు. పరిపాలన రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు విశాఖపట్నానికి ఉన్నాయని అన్నారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అయితే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఇందులో పాల్గొన్న పలువురు అభిప్రాయపడ్డారు.

అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకత లేదని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అక్కడి వారితో కుదుర్చుకున్న ఒప్పందాలను తమ ప్రభుత్వం గౌరవిస్తుందని అన్నారు. రైతుల యాత్రను అడ్డుకోవడానికి ఐదు నిమిషాలు చాలని హెచ్చరించిన బొత్స.. తాము సంయమనంతో వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు చేతగానివారు అనుకుంటే అది పొరపాటని బొత్స హెచ్చరించారు. కాకినాడ నుంచి ఇచ్చాపురం వరకు అందరూ కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైందని బొత్స అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇకపై ఇలాంటి సమావేశాలు నిరంతరం నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఈ ప్రతిపాదనను ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలని బొత్స పిలుపునిచ్చారు. అటు విశాఖలో జరిగిన ఏపీ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ర్టీ ఫెడరేషన్‌ సమావేశంలో మాట్లాడిన మంత్రి రోజా.. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ చేస్తే ఇబ్బందేంటని ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని నిర్మిస్తే లక్ష కోట్ల రూపాయల ఖర్చవుతుందని తెలిపారు. మరో వైపు అమరావతి రైతులు చేపట్టిన అరసవెల్లి పాదయాత్రను బీజేపీ నేతలు సమర్థించారు. విశాఖపట్నంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ మాట్లాడారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్‌ ప్రభుత్వం పాట్లు పడుతోందని విమర్శించారు. అమరావతి రైతులు చేపట్టిన యాత్రకు విఘాతం కలిగించేందుకే రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారని సత్యకుమార్‌ మండిపడ్డారు. ఈ యాత్రను సమర్ధించిన సీపీఐ.. రైతుల యాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తారని ఆ పార్టీ సీనియర్‌ నేత నారాయణ అన్నారు. కొంత మంది గూండాల చేత ఈ యాత్రకు ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు.

మొత్తానికి అమరావతినే రాజధానిగా ఉంచాలని రైతులు చేపట్టిన పాదయాత్ర, ఇటు ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా విశాఖపట్నం కోసం చేపట్టిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..