
రాజధాని ఫైల్స్ మూవీని శుక్రవారం వరకు విడుదల చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమాకు సంబధించి పూర్తి రికార్డులను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే పలు చోట్ల అప్పటికే సినిమాను థియేటర్లలో ప్రదర్శిస్తుండడంతో హైకోర్టు ఆదేశాల మేరకు షోను నిలిపివేయడం ఇప్పుడు రచ్చకు కారణమైంది.
ఒంగోలులోని గోపీ థియేటర్‌లో ప్రదర్శిస్తున్న రాజధాని ఫైల్స్ సినిమాను పోలీసులు అడ్డుకున్నారు. సినిమా ప్రదర్శనపై హైకోర్టు స్టే ఇచ్చిందని యాజమాన్యానికి తెలిపిన పోలీసులు.. సినిమాను ఆపేశారు. ఉదయం 11.30 నిమిషాలకు ఫస్ట్ షోకు వచ్చిన ప్రేక్షకులు మధ్యలో సినిమాను నిలిపివేయడంపై థియేటర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హైకోర్టు శుక్రవారం వరకు స్టే ఇవ్వడంతో సినిమా ప్రదర్శనను పోలీసులు నిలిపివేశారని, సహకరించాలని ప్రేక్షకులను కోరారు. సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం అన్యాయమంటూ సినిమా చూసేందుకు వచ్చిన పలువురు నినాదాలు చేశారు.
విజయవాడలోని ఓ మాల్‌లో రాజధాని ఫైల్స్ సినిమాను యాజమాన్యం నిలిపివేసింది. హైకోర్టు స్టే ఇవ్వడంతో యాజమాన్యం సినిమాను మధ్యలోనే నిలిపివేయడంపై థియేటర్ సిబ్బందితో ప్రేక్షకులు వాగ్వివాదానికి దిగారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..