Andhra Pradesh Cyclone: ఊపిరి పీల్చుకోండి మిత్రమా.. ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు.. కానీ ట్విస్ట్

AP Cyclone Updates: ఏపీకి తుఫాన్ ముప్పు తప్పింది. బంగాఖాతంలో ఏర్పడ్డ తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో తుఫాన్ ముప్పు తప్పడంతో అధికారులు ఊపీరిపిల్చుకున్నారు. అయితే తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో రెండ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ స్ఫష్టం చేసింది.

Andhra Pradesh Cyclone: ఊపిరి పీల్చుకోండి మిత్రమా.. ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు.. కానీ ట్విస్ట్
cyclone

Updated on: Jan 10, 2026 | 6:43 AM

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారే అవకాశముందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తొలుత అంచనా వేసింది. కానీ ఇది బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో శనివారం, ఆదివారం పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందని ప్రకటించింది. అలాగే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని తెలిపింది.

తప్పిన తుఫాన్ ముప్పు

ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం వాయువ్య దిశలో కుదురుతోంది. శనివారం మధ్యాహ్నం సమయానికి ఇది శ్రీలంకలో ట్రింకోమలి, జప్న మధ్యలో తీరం దాటే అవకాశముందని ఐఎండీ అంచనా వేస్తోంది. తొలుత తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పినప్పటికీ.. వాతావరణం అనుకూలించలేదు. దీని వల్ల అది మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. దీంతో తుఫాన్ ముప్పు తప్పినట్లయింది. అటు తీవ్ర వాయుగండం ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు తమిళనాడు, కేరళలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది.

పెరుగుతున్న చలి తీవ్రత

అటు తీవ్ర వాయుగుండం క్రమంలో అన్ని పోర్టుల్లో వాతావరణశాఖ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. సముద్రంలోకి మత్య్సకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. వర్షసూచన ఇలా ఉండగా.. మరోవైపు ఏపీలో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో పాటు పొగమంచు కమ్మేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల స్థాయికి పడిపోయాయి. ఇక రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తక్కువకు పడిపోయాయి. చలి కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు, వృద్దులు మరింత అప్రమత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.  కాగా శుక్రవారం పాడేరులో 4.1 డిగ్రీల సెల్సియస్, పెదబయలురో 4.8 డిగ్రీలు, చింతపల్లిలో 5 డిగ్రీలు, కొయ్యూరులో 9.7, హుకుంపేటలో 6.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.  తీవ్ర వాయుగుండం కారణంగా వర్షాలు పడనుండటంతో చలి తీవ్రత మరింత పెరగనుంది. దీంతో ప్రజలు మరింత ఇబ్బంది పడనున్నారు. ఇప్పటికే చలి పులి వల్ల ప్రజలు బయటకు రావడమే మానేశారు. ఉదయమే కాకుండా మధ్యాహ్న వేళల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాబోయే నెల పాటు చలి గాలులు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది.