Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటలు విద్యుత్.. కోతలు ఇక ఉండవ్..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారీ శుభవార్త. రాష్ట్రంలో విద్యుత్ కోతలకు చెక్ పడనుంది. ఇక నుంచి కోతల్లేని కరెంట్ ప్రజలకు అందనుంది. త్వరలో రానున్న వేసవికాలంలో రాష్ట్రంలోని ప్రజలకు కోతల్లేకుండా నిరంతరం విద్యుత్ అందించేలా కూటమి ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. అదేంటంటే..?

Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటలు విద్యుత్.. కోతలు ఇక ఉండవ్..
Power

Updated on: Jan 31, 2026 | 6:22 PM

వేసవి వచ్చిందంటే చాలు.. కరెంట్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎండ వేడి, ఉక్కబోత తట్టుకోలేక ప్రజలు ఇళ్లల్లో ఏసీల, కూలర్లు , ఫ్యాన్లు ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీని వల్ల విద్యుత్ కోతలు సాధారణంగా ఉంటాయి. దీనిని అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్లాన్‌తో ముందుకు వెళ్తుంది. ప్రజలకు వేసవిలో అసలు కోతలు లేకుండా విద్యుత్ అందించేందుకు ఇప్పటినుంచే పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం

విద్యుత్ కోతలు అనేవి లేకుండా ఉండాలంటే విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉండాలి. దీంతో రాష్ట్రంలో ఉత్పత్తిని పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కొత్త విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. రూ.6 వేల కోట్లతో కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు నిర్మిస్తుండగా.. ప్రస్తుతం వీటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండు నెలల్లో ఈ ప్రాజెక్ట్‌ల పనులు పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల విషయమై సచివాలయంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు నెలల్లో పనులు వెంటనే పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేయాలని సూచించారు. నిర్ణీత సమయంలో అన్నింటినీ కంప్లీట్ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్

ఏపీవ్యాప్తంగా ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను ఉద్దమంగా తీర్చిదిద్దాలని అధికారులు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. ఇప్పటికే ట్రాన్స్‌మిషన్ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు జిల్లాల్లో కొత్త సబ్‌స్ట్రేషన్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీటిని నిర్ణీత సమయంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇక అమరావతిలో రాజధాని అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్న క్రమంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్‌తో పాటు ట్రాన్స్‌కో ఉన్నతాధికారుల పాల్గొన్నారు.