Andhra Pradesh: కొత్తగా పెళ్లి అయిన జంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తూ కీలక ప్రకటన చేశారు. ఏపీలో కొత్తగా వివాహం చేసుకుని అత్తింటికి వెళ్లిన వారు పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియను సులభతరం చేసింది సర్కార్. సాధారణంగా పెళ్లి జరిగిన తరువాత యువతి ఇంటి పేరు మారడంతో పాటు.. కుటుంబ సభ్యుల పేర్లూ మారుతాయి. అత్తారింటి సభ్యురాలిగా యువతి పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియ కాస్త ఇబ్బందిగా ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న సీఎం జగన్.. యువతి తన పెళ్లి తరువాత అత్తవారింట్లో సభ్యురాలిగా పేరు నమోదు చేసుకునేందుకు గ్రామ సచివాలయంలో అవకాశం కల్పించారు.
పెళ్లైన యువతులు తమ పేర్లను గ్రామ/వార్డు సచివాలయాల్లో మార్చుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఎవరైనా కొత్తగా పేరు నమోదు చేయించుకోవాలంటే సంబంధిత వ్యక్తి వేలిముద్రలు నమోదు చేస్తారు. ఆ వివరాలను సచివాలయాల్లో నమోదు చేస్తే.. ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ ఆమోదం తెలుపుతారు. అలా వారి పేర్లు కుటుంబంలో సభ్యులుగా నమోదు చేస్తారు. ఆ తరువాత వారి పేర్లను రేషన్ కార్డులో చేరుస్తారు. కాగా, ఈ నిర్ణయంతో పెళ్లైన కొత్త జంటలకు ప్రయోజనం చేకూరనుంది. కొత్తగా పేరు నమోదు చేయించుకోవడంతో పాటు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందడానికి వీలు ఉంటుంది.