
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డ్ ఉన్నవారికి బిగ్ షాక్ తగిలింది. కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రైస్ కార్డ్ దరఖాస్తు సేవ రుసుం (సర్వీస్ ఛార్జ్)లను ప్రభుత్వం ఒకేసారి భారీగా పెంచింది. కొత్త రైస్ కార్డ్, డూప్లికేట్ రైస్ కార్డ్, రైస్ కార్డులో సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పుతో పాటు రైస్ కార్డ్ విభజన వంటి అన్ని సేవల దరఖాస్తు సేవా రుసుంలను ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. దీంతో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవాలన్నా, కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నా లేదా సభ్యులను చేర్చాలన్నా, తొలగించాలన్నా సర్వీస్ ఛార్జీలు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. రేషన్ కార్డుదారులకు ఇది అదనపు భారమనే చెప్పుకోవచ్చు.
– గతంలో రూ. 24 సేవా రుసుం కలిగిన సేవలు రూ.100కు పెంచారు
– గతంలో రూ.48 సేవా రుసుముగా గల రైస్ కార్డ్ విభజన సేవ రూ.200కు పెరిగింది
– మీసేవ, స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయం, సిటిజన్ పోర్టల్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వివిధ రకాల రైస్ కార్డ్ సేవలు అందుబాటులో ఉన్నాయి
-కొత్త రేషన్ కార్డ్ దరఖాస్తుతో పాటు పాత కార్డు పొగోట్టుకున్న సందర్భంలో డూప్లికేట్ కార్డు పొందటం, రేషన్ కార్డుల్లోని వివరాలు తప్పుగా ఉంటే సవరించుకోవడం, కొత్త సభ్యులను చేర్చడం, ఉన్న సభ్యులను తొలగించడం, అడ్రస్ మార్పు, రైస్ కార్డును విభజించడం వంటి అన్ని సేవలకు సర్వీస్ ఛార్జీలకు అమలవుతాయి.
కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ వ్యవస్థలో సమూలు మార్పులు శ్రీకారం చుట్టింది. క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త స్మార్ట్ కార్డులు రాష్ట్రంలోని లబ్దిదారులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రభుత్వం తొలగించగా.. వృద్దులకు మాత్రమే ప్రస్తుతం రేషన్ డీలర్లు ఇంటికి వెళ్లి సరుకులు పంపిణీ చేస్తున్నారు. మిగతావారు దుకాణాల వద్దకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గతంలో షాపుల ద్వారా బియ్యం, పంచదార మాత్రమే పౌరసరఫరాల శాఖ పంపిణీ చేసేంది. కానీ ఇప్పుడు రాగులు, జొన్నలు, గోధుమ పిండి కూడా లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారు. గోధుమ పిండిని కిలో రూ.20కే అందిస్తున్నారు. ప్రస్తుతం కిలో రూ.70గా ఉండగా.. కేవలం రూ.20కే ప్రభుత్వం అందిస్తోంది. ఇక కందిపప్పును కూడా ప్రభుత్వం తక్కువ ధరకు గతంలో పంపిణీ చేయగా.. ప్రస్తుతం నిలిపివేసింది. భవిష్యత్తులో కందిపప్పు కూడా అందించే అవకాశముంది.