
ఏపీ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉగాదిని పురస్కరించుని మార్చి నుంచి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందుకు ఇప్పటినుంచే సిద్దమవుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరో కొత్త కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందడుగు వేశారు. ఉగాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొక్కులు భారీగా నాటే కార్యక్రమానికి ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్ కవర్ ప్రాజెక్ట్ కార్యక్రమంపై సుదీర్ఘంగా చర్చించారు. మార్చి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్నీ శాఖలు సిద్దం చేయాలన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రహదారుల వెంట, ఇతర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇక రైతుల భూమల్లో పండ్ల రకాలను నాటాలని, ఇందుకోసం రానున్న బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకోసం సీఎం చంద్రబాబుతో తాను చర్చిస్తానన్నారు. అన్ని శాఖల అధికారులు గ్రీన్ కవర్ ప్రాజెక్టుపై పక్కా ప్లాన్‌తో ముందుకు రావాలని, ఫిబ్రవరి 5వ తేదీన మరోసారి సమావేశం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపుపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని, అందులో భాగంగా ఈ కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పచ్చదనం ఉండేలా చేయాలని, స్వదేశీ మొక్కలు నాటడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. తీరప్రాంతాల్లో పెనుగాలులను తట్టుకునేందుకు, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకు మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30 శాతం పచ్చదనం ఉందని, 2030 నాటికి 37 శాతానికి చేరుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
2047 నాటికి రాష్ట్రంలోని సగ భాగం పచ్చదనంతో నిండిపోవాలని, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకోసం 32.60 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉంటుందన్నారు. ఇందులో ఉద్యానశాఖ 12 శాతం మొక్కలు నాటే లక్ష్యం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 40 శాతం తీర ప్రాంతం అటవీశాఖ పరిధిలో ఉందని, మిగతా భూభాగంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు పవన్ తెలిపారు. నేషనల్ హైవేస్ వెంట మొక్కలు ఉన్నట్లే.. రాష్ట్రంలోని ప్రతీ రహదారి వెంట మొక్కలు ఉండేలా చేస్తామన్నారు. తీర ప్రాంతాల్లో ఉప్పు నీటిని తట్టుకునేలా మొక్కలు నాటుతామన్నారు. అన్ని శాఖలు ఇందులో భాగస్వామ్యం కావాలని సూచించారు. 2030 నాటికి 9 లక్షల హెక్టార్లలో మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.