అమ్మ అడుగుల్లో అడుగులు వేసి…అడవిలో స్వేచ్ఛగా విహరంచాల్సిన పులికూనలు…తప్పిపోయి జనారణ్యంలోకొచ్చి పడ్డాయి. తల్లికోసం తల్లడిల్లిపోయాయి. అమ్మ స్పర్శ లేక విలవిల్లాడిపోయాయి. అభయారణ్యంలో నుంచి తప్పిపోయి జనారణ్యంలోకొచ్చిపడ్డ నాలుగు పులిబిడ్డలను తల్లి చెంతకు చేర్చేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేశారు. ఆత్మకూరు అడవుల్లో తల్లి జాడ కోసం ఐదురోజులుగా అణువూ గాలించినా…ఫలితం లేకుండా పోయింది.
40 ట్రాప్ కెమెరాలతో గాలించినా ఫలితంలేదు. అధికారులు పులిపిల్లల్ని కలిపేందుకు చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. అయితే ఆహారం కోసమో… లేదంటే తలిపుల్లి మగతోడు కోసం పిల్లల్ని వీడి వెళ్ళడమో.. పులికూనలు తప్పిపోవడానికి ఓ ప్రధాన కారణమన్నది నిపుణుల అభిప్రాయం. ఏదైతేనేం తల్లి పులికోసం తల్లడిల్లిన పులికూనలు శాశ్వతంగా తల్లికి దూరమయ్యాయి. అడవిలో తల్లి పులి…అడవి బయటపసి కూనలు…ఓ విషాదం…
ఆపరేషన్ లీలావతి ఫలించలేదు. తల్లి పిల్లలను కలిపేందుకు ఫారెస్ట్ సిబ్బందిచేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీసీ కెమెరాల నిఘా వృధాప్రయాసే అయ్యింది. ఎట్టకేలకు ఆపరేషన్ లీలావతికి ముగింపు పలక్క తప్పలేదు ఫారెస్ట్ అధికారులకు. తిరుపతి జూపార్క్‌కి తరలించారు. ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య వాటిని సంరక్షిస్తున్నారు. పులికూనల కోసం కేర్‌టేకర్లు… కేర్‌టేకర్లకీ ప్రత్యేక శిక్షణనిస్తోన్న అధికారులు. వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో పిల్లపులులను సంరక్షిస్తున్నారు.
పులికూనలు ఇప్పుడు ఎంతో అపురూపం… అమ్మలేని పులి బిడ్డలని గుండెలకు హత్తుకోవాలి. అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక్కటి కాదు. నాలుగు పులిపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునే ప్రయత్నం జరుగుతోంది. అయినా వాతావరణం మార్పు… అమ్మలేదని బెంగటిల్లాయి పులిపిల్లలు… కృత్రిమ ఆహారంతో అనారోగ్యం పాలయ్యే ప్రమాదం కూడా పొంచివుంది. పులి తిని ఊసిన పదార్థాన్ని తినే పులిపిల్లలకు మొదట రసాయనిక పాలు పట్టారు. వాతావరణం మార్పో… ఆహారంలో మార్పో…పులికూనలు డీహైడ్రేషన్‌కి గురయ్యాయి. ఓ చిన్ని పులి కూన చాలా వీక్‌గా ఉండడం మరింత ఆందోళనకరంగా మారింది.
పులి పిల్లల్ని అనారోగ్యం బారిన పడకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సగం మేర అటవీ ప్రాంతంలో ఉండే వాతావరణాన్నే అందుబాటులోకి తెచ్చారు. డబుల్ డోర్ సిస్టమ్ గదిలో వుడెన్ ఫ్లోరింగ్‌తో ఏసీ గదిలో ఉంచి కాపాడుతున్నారు. ప్రతి 4గంటలకు ఒకసారి కెనాన్ పౌడర్, 100 గ్రాముల చికెన్ లివర్ మిక్స్ చేసిన ఆహారాన్ని అందిస్తున్నారు. ఎంత ఎక్కువ మంది తాకితే పులిపిల్లలకు అంత ప్రమాదం…హ్యూమన్ ప్రింట్‌లు ఎక్కువగా పడకుండా…జాగ్రత్తలు తీసుకుంటున్నారు జూ అధికారులు. రెండు నుంచి మూడు నెలల వయస్సున్న ఈ పులి పిల్లలను ఇంకా ఎంతకాలం పాటు ఇక్కడుంచుతారన్న ప్రశ్నకు మెచ్యూరిటీ ఏజ్ వచ్చేవరకు తప్పదన్న ఆన్సర్ ఇస్తున్నారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..