A.P. EAPCET-2021: ఆంధ్ర ప్రదేశ్‌లో రేపటి నుంచి AP EAPCET (ఇఎపిసెట్) పరీక్షలు జరుగనున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాలకిగాను ఉన్నత విద్యామండలి ఈ ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తుంది. కాకినాడ జెఎన్టీయు ఆధ్వర్యంలో సెట్ నిర్వహణ జరుగుతోంది. గతంలో ఎంసెట్… ఇపుడు ఎప్ సెట్ గా మారిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి కంప్యూటర్ ఆధారితంగా ఆన్ లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఏపీ ఇఎపి సెట్ కి 2.60 లక్షల మంది విద్యార్ధుల దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,75,796 మంది విద్యార్థులు.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకి 83,051 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇంజనీరింగ్ విభాగానికి రేపటి నుంచి పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండవ సెషన్ గా పరీక్షలు నిర్వహిస్తారు. ఆంగ్ల, తెలుగు మాధ్యమంలో 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్‌లో ప్రశ్నాపత్రం ఉంటుంది. పరీక్షా కేంద్రాల వద్దకి గంటన్నర ముందే చేరుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచించింది.
కొవిడ్ నిబంధనల నడుమ పగడ్భందీగా ప్రవేశ పరీక్షలు నిర్వహించతలపెట్టారు. మాస్క్ లేకపోయినా.. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలలోకి విద్యార్ధులకి అనుమతి నిరాకరిస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో హాజరైతే విద్యార్ధులపై క్రిమినల్ కేసులు మోపుతారు. కొవిడ్ పాజిటివ్ లక్షణాలున్న విద్యార్ధులకి ప్రత్యేక ఐసోలేషన్ రూమ్‌లలో పరీక్ష పెడతామని విద్యామండలి తెలిపింది.