ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచినట్టు కనిపిస్తుండగా.. అధికార పార్టీ సైతం స్పీడ్ పెంచింది. నిన్న జయహో బీసీ కార్యక్రమం నిర్వహించడంతో పాటు.. ఇవాళ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు ఏపీ సీఎం జగన్. మరి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశమేంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.. సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో అత్యంత కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ మధ్యామ్నం 3 గంటలకు మీటింగ్ జరగనుంది. 175 నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షుడు, రీజనల్ కోఆర్డినేటర్లతో భేటీ కానున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇటీవలే అన్ని నియోజకవర్గాల పరిశీలకుల నియామకాలు జరిగాయి. ఎమ్మెల్యేల పనితీరు, కింద స్థాయి కార్యకర్తల అభిప్రాయాలను అబ్జర్వర్ల ద్వారా తెలుసుకోనున్నారు. ఈ సమావేశంలో క్షేత్ర స్థాయి స్థితిగతులపై అద్యయనం చేయనున్నారు. తర్వాత పరిశీలకులకు సీఎం జగన్ దశా- దిశా నిర్దేశం చేయనున్నారు.
ఇప్పటికే ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తమ ప్రచారం మొదలు పెట్టేశాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటూ.. దాదాపు అందరూ ప్రకటించేశారు. మొన్న.. ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ముందస్తు ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు మనం ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనే ఉన్నామని అనడం తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో నిన్న జరిగిన జయహో బీసీ సభలో ఏపీ సీఎం జగన్ సైతం ఎన్నికల యుద్ధం మొదలైందని ప్రకటించారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమేనంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం డిక్లైర్ చేశారు. ఇదేం కర్మ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. వచ్చే జనవరి 27 నుంచి నారా లోకేష్ సైతం పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఎన్నికల సమరానికి వారాహి రెడీ అంటూ.. తన బస్సు యాత్రకు సంబంధించిన ట్వీట్ తో మరింత హీట్ పెంచారు.
ఈ క్రమంలోనే అధికార వైసీపీ మరింత జోష్ పెంచుతోంది. ఇందులో భాగంగానే జిల్లా అధ్యక్షులు, అబ్జర్వర్ల తో సమావేశం నిర్వహించనున్నారు సీఎం జగన్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు సభలు నిర్వహిస్తోంది. నిన్న బీసీ ప్రధానంగా జయహో సభ నిర్వహించినట్టుగానే.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి కూడా ఇలాంటి సమావేశాలను నిర్వహించేలా తెలుస్తోంది.. అధికార వైసీపీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..