Andhra Pradesh: కేబినెట్‌ తొలి భేటీ .. ఎజెండా మేటి.. సమపాళ్లలో సంక్షేమం, అభివృద్ధి

|

Jun 24, 2024 | 7:30 PM

ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం... సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళుతోంది. తొలిసారి సమావేశమైన చంద్రబాబు మంత్రివర్గం... నవ్యాంధ్ర నవ నిర్మాణం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతో పాటు... అభివృద్ధికి బాటలు వేసేలా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించింది. సంక్షేమం ఓవైపు.. అభివృద్ధి మరోవైపు… ఈ రెండూ కొనసాగిస్తూనే రాజకీయంగానూ తనదైన దూకుడుతో ముందుకెళ్లాలని కూటమి సర్కార్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు అర్థమవుతోంది.

Andhra Pradesh: కేబినెట్‌ తొలి భేటీ .. ఎజెండా మేటి.. సమపాళ్లలో సంక్షేమం, అభివృద్ధి
Andhra Cabinet Meeting
Follow us on

ఏపీలో ఇటీవల కొలువుదీరిన కొత్త కేబినెట్‌… ఇవాళ సుదీర్ఘ భేటీ అనంతరం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపిన మంత్రి మండలి.. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు కూడా ఓకే చెప్పింది. పెన్షన్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్‌… 66లక్షల మందికి… సచివాలయం సిబ్బందితో ఇంటింటికీ ఆ మొత్తాన్ని అందజేయాలని నిర్ణయించింది. అయితే, వాలంటీర్ల విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మంత్రివర్గం.

జూలై 1న పేదల అకౌంట్లలో రూ. 4408 కోట్లు

తొలి కేబినెట్‌ భేటీలోనే పెన్షన్లపై నిర్ణయం తీసుకోవడంతో… పేదలకు ఎంతో కీలకమైన సంక్షేమపథకాలకు పెద్దపీట వేస్తామని కొత్త ప్రభుత్వం సంకేతాలిచ్చినట్టుగా స్పష్టమవుతోంది. దాదాపు 64లక్షల మందికి చేరనున్న వివిధ రకాల పెన్షన్ల కోసం.. గత ప్రభుత్వం కన్నా పదివేల కోట్లు అదనంగా ఖర్చు చేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. ఈ పెంపువల్ల.. ప్రతీనెలా అదనంగా 819 కోట్ల రూపాయల ఆర్థిక భారం ప్రభుత్వంపై పడనుంది. అయినా వృద్దులు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది సర్కారు. పెంపునకు సంబంధించి గత మూడు నెలల బకాయి పెన్షన్‌ 1650 కోట్ల రూపాయలను కూడా విడుదల చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. అంటే, జూలై ఒకటిన 4,408 కోట్ల రూపాయలను కేవలం పేదల అకౌంట్లలో వేయనుంది ప్రభుత్వం.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుకు ఆమోదం

గత ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దును కూడా కేబినెట్‌ సమర్థించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు.. చంద్రబాబు చేసిన ఐదు సంతకాల్లో ఈ అంశం కూడా ఒకటి కావడం విశేషం. అందుకే, దీనికి ప్రాధాన్యతను ఇచ్చిన కేబినెట్‌… యాక్ట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ చట్టం ద్వారా నష్టపోయిన రైతులకు న్యాయం చేసే అంశంలో ఎలా వ్యవహరిస్తారనేది తెలియాల్సి ఉంది.

యువతలో విశ్వాసం నింపేలా స్కిల్‌ సెన్సెస్‌

ఏపీలో నిరుద్యోగ సమస్యను తొలగించేందుకు గట్టిగా కృషి చేయాలని నిర్ణయించింది కేబినెట్‌. నిజం చెప్పాలంటే నిరుద్యోగ అంశం ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. అందుకే, యువతలో నమ్మకాన్ని నింపేలా.. స్కిల్ సెన్సెస్ కార్యక్రమాన్ని అమలు చేయాలని డిసైడ్‌ అయ్యింది ప్రభుత్వం. తద్వారా యువతకు, నిరుద్యోగులకు తామిస్తున్న ప్రాధాన్యతను తెలియజెప్పొచ్చని భావిస్తోంది. అంతేకాదు, యువతను పెడదోవ పట్టిస్తున్న గంజాయిని పూర్తి నిర్మూలించేందుకు.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమేందుకు.. ఏం చేయాలన్న దానిపై చర్చించేందుకు ఐదుగురు మంత్రులతో సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రులు అనిత,లోకేష్,కొల్లు రవీంద్ర,సత్య కుమార్,సంధ్యా రాణి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ పనిచేయనుంది.

ఈనెల 31 నుంచి 7శాఖలపై శ్వేతపత్రాలు

సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లుగా ముందుకెళ్తూనే… రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ప్రణాళిక రచిస్తోంది కూటమి ప్రభుత్వం. అందుకే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల కళ్లకు కట్టేలా చూపించేందుకు… ఈ నెల 31 నుంచి 7 శాఖల్లో శ్వేత పత్రాలు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలవరం,అమరావతి, విద్యుత్, ల్యాండ్ -సాండ్, లిక్కర్, లా అండ్ ఆర్డర్, ఆర్థికశాఖలపై వైట్ పేపర్లు రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది.

పోలవరం నుంచే శ్వేతపత్రాలు మొదలు!

ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును… రాష్ట్రప్రభుత్వం టాప్‌ ప్రయారిటీగా భావిస్తోంది. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్న చంద్రబాబు.. గత ప్రభుత్వం ఏం చేసిందనే విషయానికి సంబంధించి, ప్రజల ముందు నిజానిజాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే, ముందుగా పోలవరంపైనే శ్వేత పత్రం విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.

పోలవరం ఖర్చు, నిధులపై శ్వేతపత్రం!

గతంలో ఇదే పోలవరంపై.. అసెంబ్లీ వేదికగా పెద్ద యుద్ధమే జరిగింది. నాడు అధికార పక్షంగా వైసీపీ… ప్రతిపక్ష టీడీపీని టార్గెట్‌ చేసింది. గత ప్రభుత్వ తీరు వల్లే ప్రాజెక్ట్‌ ఆలస్యమైందన్న ఆరోపణలు గుప్పించింది. అయితే, పోలవరం విషయంలో అసలేం జరిగిందో ప్రజలకు తెలియజెప్పాలన్న కృతనిశ్చయంతో కూటమి సర్కార్‌ ఉంది. అందుకే దీనికి సంబంధించి శ్వేత పత్రాన్ని విడుదల చేసి… ఎప్పుడెన్ని నిధులు వచ్చాయ్‌? ఎక్కడెక్కడ ఎలా ఖర్చయ్యాయ్‌? నిధులు దుర్వినియోగమయ్యాయా? లేక డైవర్షన్‌ జరిగిందా? అనే వివరాలను ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

పోలవరం తర్వాత కీలకం అమరావతి

పోలవరం తర్వాత.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అంశం రాజధాని అమరావతి. చంద్రబాబు మానస పుత్రికగా పురుడు పోసుకున్న అమరావతి.. 2019 తర్వాత నిర్లక్ష్యానికి గురైంది. గత ప్రభుత్వం మూడు రాజధానుల నినాదం ఎత్తుకోవడంతో… అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. ఇప్పటికే అమరావతి ప్రాంతమంతా పర్యటించిన చంద్రబాబు.. అక్కడి నిర్మాణాలను పరిశీలించారు. సో.. రాజధాని ప్రస్తుత పరిస్థితిపై ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేస్తే.. ప్రజలకు పూర్తి వివరాలు తెలుస్తాయన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఎందుకంటే గత టర్మ్‌లో అత్యంత వివాదాస్పదమైన అంశంగా.. పొలిటికల్‌ డిబేట్‌గా నిలిచింది రాజధాని అమరావతి. దాదాపు 2019 నుంచి 2024 దాకా.. దీని మీదే రాజకీయ వేడి ఎగిసిపడింది. అందుకే కొత్త ప్రభుత్వానికి ఇది సవాల్‌గా మారనుంది. అమరావతి అభివృద్ధి కొనసాగించేలా అప్పుడే పనులు మొదలెట్టిన ప్రభుత్వం… శ్వేత పత్రం ద్వారా మరిన్ని విషయాలను ప్రజల ముందుకు తీసుకురావాలనుకుంటోంది.

జూలై 18లోపు శ్వేతపత్రాలు విడుదల

రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించిన మరికొన్ని అంశాలపైనా వైట్‌ పేపర్‌ రిలీజ్‌ చేసేందుకు కేబినెట్‌ నిర్ణయించింది. విద్యుత్‌, శ్యాండ్‌, లా అండ్‌ ఆర్డర్‌, లిక్కర్‌ అంశాలపైనా శ్వేత పత్రాలు విడుదల చేయాలని డిసైడైంది. విద్యుత్‌శాఖపై అప్పటి పాలక, ప్రతిపక్షాల మధ్య ఏరేంజ్‌లో మాటల యుద్ధం నడిచిందో… ఇసుక విషయంలో ఏ స్థాయి రచ్చ చెలరేగిందో ప్రపంచమంతా చూసింది. అందుకే ఈ అంశాలపైనా ఫోకస్‌ చేసింది కేబినెట్‌. ఇక లా అండ్‌ ఆర్డర్‌.. లిక్కర్‌ అంశాలూ.. గతంలో చాలా వివాదాస్పదమయ్యాయి. అందుకే వీటిపైనా శ్వేత పత్రం విడుదల చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. మొత్తంగా ఏడు శాఖలపై శ్వేత పత్రాలను జులై 18 లోగా రిలీజ్ చేయాలని టైమ్‌ ఫిక్స్‌ చేసింది.

ఒకేసారి 183 అన్నా క్యాంటీన్లు

ఇక, ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ఆమోదం తెలిపింది కేబినెట్‌. గంజాయి, డ్రగ్స్ నివారణపై కీలకంగా చర్చించిన మంత్రివర్గం… 100 రోజుల్లో డ్రగ్స్ అరికట్టేలా యాక్షన్ ప్లాన్‌ను ప్రతిపాదించింది. ఇకనుంచి మంత్రులకు జిల్లాల వారిగా ఇంచార్జీ బాధ్యతలు కూడా దక్కనుండంతో… నిర్దేశిత లక్ష్యాలు మరింత ముందుకు తీసుకెళ్లొచ్చనే భావనలో ప్రభుత్వం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..