విజయవాడకు వరదను నియంత్రించడమే లక్ష్యంగా బుడమేరు గండ్ల పూడ్చివేత ప్రక్రియ యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. పగలురాత్రీ తేడా లేకుండా నిరాటంకంగా పనులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మంత్రి నిమ్మల రామానాయుడు సారథ్యంలో ఇంజినీరింగ్ అధికారులు యుద్ధప్రాతిపదికన రెండ్లు గండ్లను పూడ్చివేశారు. సైన్యం సహకారంతో మూడో గండి పూడ్చివేత పనులు సాగుతున్నాయి. రెండు గండ్లు పూడ్చడంతో మూడో గండి దగ్గర వరద ఉధృతి పెరిగింది. ఓవైపు వర్షం మరో వైపు వరద ప్రవాహం అయినా పనులు ఆగడం లేదు. గండ్లు దగ్గర సమస్య పరిష్కరించేందుకు ఆర్మీ పలు చర్యలు తీసుకుంటోంది. గేబియాన్ బుట్టల ద్వారా పూడ్చాలని మిలిటరీ అధికారులు నిర్ణయించారు. గేబియాన్ బుట్ట అంటే ఇనుప చువ్వలతో బుట్టలా చేసి దానిని ఇసుక బస్తాలు, పెద్ద రాళ్లతో నింపుతారు.
బుడమేరుకు గండ్లు పడిన చోట 10 నుంచి 15 మీటర్ల వెడల్పు ఉన్నట్లు ఆర్మీ గుర్తించింది. మూడో గండి 80 నుంచి 100 మీటర్లు ఉందని తెలిపింది. వీటిని గేబియాన్ బుట్టలతో పూడ్చుతామని, మొదట గేబియాన్ బుట్టలు పేర్చి, తర్వాత అందులో రాళ్లు వేస్తామని మిలిటరీ అధికారులు వివరించారు. ఈ మేరకు బుట్టలను పటిష్టం చేసేందుకు 4 మీటర్ల వరకు రక్షితకట్ట నిర్మిస్తామన్నారు. గేబియాన్ బుట్టల తయారీ స్థానికంగా జరుగుతోందన్న ఆర్మీ, ఇసుక సంచులతో నింపి హెస్కో బుట్టలు కూడా వాడతామని తెలిపింది. అదేవిధంగా ఈ ఆపరేషన్‌లో గండ్లను పూడ్చేందుకు ఆర్మీ హెచ్‌ఏడీఆర్ బృందం పనిచేస్తోందని మిలిటరీ అధికారులు తెలిపారు. మరోవైపు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఇదే గండి ద్వారా 30 నుంచి 40వేల క్యూసెక్కుల వరదనీరు విజయవాడలోని రాయనపాడు, అజిత్‌సింగ్‌నగర్ తదితర ప్రాంతాలను ముంచెత్తింది. మరోవైపు అజిత్ సింగ్‌నగర్‌లోని పలు ప్రాంతాల్లోకి మళ్లీ వరద చేరింది. గురువారం కంటే శుక్రవారం మరో అడుగు ఎత్తుకు వరద ఎగబాకింది. బుడమేరు ముంపు నుంచి క్రమంగా తేరుకున్న సమయంలో మళ్లీ వరద రావడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రామకృష్ణాపురం, రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో రాకపోకలకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు, సీఎం చంద్రబాబు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేశారు. బుడమేరు డ్రైన్, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వరద ప్రవాహం, ముంపు, గండ్లు పడిన ప్రాంతాలను సర్వే చేశారు.