
నదీపరివాహక ప్రాంతాలు ప్రాచీన కాలం నుంచి జనావాసాలకు అనుకూలంగా ఉన్నాయి. నదుల పక్కన జనావాసాలు ఏర్పరుచుకోవడానికి కారణం తాగునీటి సౌకర్యం, వ్యవసాయానికి అనుకూలమైన సారవంతమైన భూమి ఉండటం ప్రధాన కారణాలు. ప్రపంచంలోని మానవ నాగరికతలు చాలావరకు నదులు, సముద్రాల పరీవాహక ప్రాంతాలు, అడవుల్లోని మంచినీటి చెలమలనుంచే ప్రారంభమయ్యాయి. నైలు నది పక్కన ఈజిప్షియన్, టైగ్రిస్-యూఫ్రటీస్ నదుల పక్కన మెసొపొటేమియన్, సింధులోయ నాగరికత సింధు నది ఒడ్డున ఏర్పడ్డాయి. ఇక మన దేశంలో గంగా, గోదావరి, కృష్ణ, పెన్న ఇలాంటి నదీపరివాహక నదుల పక్కనే పట్టణాలు, గ్రామాలు ఏర్పడ్డాయి… అలా ఏర్పడిన నదులతో మానవ జీవితాలు ప్రభావితం అవుతుంటాయి… దేవాలయాలు, పూజనీయ, దర్శనీయ ప్రాంతాలు కూడా నదుల పక్కనే ఏర్పడ్డాయి… అలాంటి నదుల్లో ప్రాచీన నాగరికతకు చెందిన ఆనవాళ్ళు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి… అలాంటి ఓ పురాతన విగ్రహాలు ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ నదీపరివాహక ప్రాంతంలో తాజాగా బయటపడ్డాయి.
తాజాగా ప్రకాశంజిల్లాలో గుండ్లకమ్మ నదిలో ప్రాచీన శివలింగం, నంది విగ్రహాలు కనిపించడంతో అందరూ తన్మయానికి లోనవుుతన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ముష్ట్లగంగవరం సమీపంలో గుండ్లకమ్మ నది గర్భంలో ఈ విగ్రహాలను గ్రామస్థులు గుర్తించారు. కార్తీకమాసంలో శివలింగం బయటపడటంతో తమ గ్రామానికి సాక్షాత్తూ శివుడే వచ్చాడంటూ గ్రామంలో ప్రచారం జరిగింది. దీంతో గ్రామస్థులు నదిలో బయటపడ్డ శివలింగానికి, నంది విగ్రహాలకు పూజలు చేయడం ప్రారంభించారు… ముష్ట్ల గంగవరం దగ్గర తంగిరాల గ్రామం పక్కనే గుండ్లకమ్మ నది రెండు పాయలుగా విడి పోయి కిందకు వెళ్ళే కొద్ది తిరిగి కలిసి ప్రవహిస్తుంటుంది… ఈ రెండు పాయల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో ఈ విగ్రహాలను గుర్తించారు… ఇటీవల మొంథా తుఫాను కారణంగా గుండ్లకమ్మ నదికి వచ్చిన వరద వల్ల రెండు పాయల మధ్య ఉన్న మట్టికొట్టుకుని పోయి విగ్రహాలు బయటపడ్డాయి… నదిలో చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులకు ఈ విగ్రహాలు కనిపించడంతో గ్రామస్థులకు సమాచారం అందించారు… కార్తీకమాసంలో నదిలో శివలింగం, నంది విగ్రహాలు బయటపడటం యాధృచ్చికం కాదని, సాక్షాత్తూ శివయ్యే వచ్చాడంటూ పూజలు చేస్తున్నారు… గుండ్లకమ్మ నది మధ్యలో ఈ విగ్రహాలు కనిపించిన చోట గుడి కట్టేందుకు గ్రామస్థులు సిద్దమవుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..