
శుభకార్యానికని ఇంటి నుంచి బయల్దేరిన ఓ ఫ్యామిలీని గమ్యం చేరకముందే మృత్యువు మింగేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఓ ఫ్యామిలీ శ్రీకాకుళంలో బంధువుల శుభకార్యం నిమిత్తం ఆదివారం తెల్లవారుజామున కార్లో బయల్దేరింది. అయితే వారు ప్రయాణిస్తున్న కారు సరిగ్గా అనకాపల్లి జాతీయ రహదారిపై ఉన్న గుండిగుండం సమీపంలోకి రాగానే అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు ముందు భాగం మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తుల్లో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక్కరు మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.
అనంతరం కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అలాగే ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్‌ను క్లియర్ చేసి.. రోడ్డుకు అడ్డంగా ఉన్న కారు, లారీలను క్రేన్ సహాయంతో తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా సాంకేతిక లోపం ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.