AP Crime News: అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతున్నా కొంతమందికి చెవికెక్కడం లేదు. మాయ మాటలకు నమ్మి సర్వం పోగొట్టుకుంటున్నారు. బ్యాంకులు, బాగా రద్దీగా ఉండే ప్రదేశాల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లేదంటే ఎవరో ఒకరి చేతిలో మోసపోక తప్పదు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు మనల్ని బురిడీ కొట్టించి సర్వం మాయం చేస్తారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఇదే జరిగింది. బ్యాంకు ఉద్యోగిని అని చెప్పి ఓ అమాయక మహిళ నుంచి లక్షరూపాయలు కాజేశాడు ఓ దుండగుడు.
తెనాలి పట్టణానికి చెందిన ఓ మహిళ బ్యాంకులో నగదు డిపాజిట్ చేసేందుకు కొత్తపేట ఎస్బిఐకి వెళ్లింది. అక్కడ ఆమెకు ఓ గుర్తు తెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు. మెల్లగా మాటలు కలిపి తాను బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ అని నమ్మించాడు. నగదును తాను డిపాజిట్ చేస్తానంటూ నమ్మించి లక్ష రూపాయలతో ఉడాయించాడు. ఖాతాలో నగదు డిపాజిట్ కాకపోవడంతో ఆందోళన చెందిన మహిళ బ్యాంకుకు వెళ్లి అధికారులను కలిసింది. వారు నగదు జమ కాలేదని చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించింది. అప్పటికి కానీ ఆమెకు పూర్తి విషయం అర్థం కాలేదు.
వెంటనే తేరుకున్న మహిళ బ్యాంకు అధికారుల సూచన మేరకు సీసీ పుటేజీని పరిశీలించి నగరంలోని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకు సీసీ కెమెరాలను పరిశీలించి దొంగ కోసం గాలిస్తున్నారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకుల వద్ద కాపు కాస్తారు. అనుమానంగా ఎవరు కనపడినా సమాచారం అందించాలని పోలీసులు బ్యాంకు అధికారులకు సూచించారు.