Animal Lover: ఒక చిన్న సంఘటన జంతు ప్రేమికుడిగా మార్చేసింది.. 11 ఏళ్లుగా మూగజీవాలకు బాషా సేవలు..

|

Apr 08, 2022 | 12:56 PM

Animal Lover Basha: కన్నవారినే పట్టించుకోని ఈ హైటెక్ యుగంలో మూగ జీవాలకోసం పరితపించడం.. వాటి కోసం సమయం కేటాయించి వాటికి ఆకలి తీర్చడం అంటే మామూలు విషయం కాదు. ఒక చిన్న సంఘటన బాషా మోహిద్దీన్..

Animal Lover: ఒక చిన్న సంఘటన జంతు ప్రేమికుడిగా మార్చేసింది.. 11 ఏళ్లుగా మూగజీవాలకు బాషా సేవలు..
Kadapa
Follow us on

Animal Lover Basha: కన్నవారినే పట్టించుకోని ఈ హైటెక్ యుగంలో మూగ జీవాలకోసం పరితపించడం.. వాటి కోసం సమయం కేటాయించి వాటికి ఆకలి తీర్చడం అంటే మామూలు విషయం కాదు. ఒక చిన్న సంఘటన బాషా మోహిద్దీన్.. అనే వ్యక్తిని మూగజీవ ప్రేమికుడిగా మార్చేసింది. దశాబ్ద కాలంగా తాను ఈ మూగ జీవాల కోసం తన సంపాదన అంతా వెచ్చిస్చున్నాడంటే తనలోని మానవత్వాన్ని అర్థం చేసుకోవచ్చు.. కడప (Kadapa District) నగరంలోని నకాశ్ వీధికి చెందిన బాషా మోహిద్దీన్ (basha mohiuddin) చిన్న జిమ్ నడుపుతుంటాడు. దానిపై వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించడంతోపాటు.. ప్రతిరోజు మూగజీవాల ఆకలి తీరుస్తుంటాడు. అంతేకాదు ప్రతి ఆదివారం కడప నుంచి బద్వేల్ వరకు ఉన్న అటవీ ప్రాంతంలోని మూగజీవాలకు ఆహారాన్ని అందిస్తుంటాయి. తాను ఈ మూగజీవ ప్రేమికుడిగా మారడానికి చిన్న సంఘటన కారణమని భాషా చెబుతున్నాడు. తను పదేళ్ళ క్రితం కడప నుంచి బద్వేలుకు వెళుతున్న సందర్భంలో సిద్ధవటం అడవిలో ఎండాకాలంలో ఒక బాటిల్లోని నీటికోసం మూగ జీవాలు కొట్లాడుకోవడం చూసి చలించి పోయానని తెలిపాడు. అప్పటి నుంచి మూగ జీవలకు ఆహారం, నీటిని అందిస్తున్నానని పేర్కొంటున్నాడు. అంతేకాదు బాషా తన ఇంటి వద్ద కాకులు, పక్షులు, పిచ్చుకలు, కుక్కలకు ఆహారాన్ని.. నీటిని అందిస్తుంటాడు. ఇదేదో తూతూ మంత్రంగా చేసే పని కాదు నిత్యం చేస్తున్న ఒక యజ్ఞం.

భాషా ఈ కార్యక్రమాన్ని 2011 నుండి ఇప్పటి వరకు నిర్విరామంగా చేస్తున్నాడు. మూగ జీవాలకు ఆకలి తీరుస్తూ.. వాటి పాలిట దేవుడయ్యాడు.. భాషా పిలిస్తే దూరంగా ఉన్న కోతులు సైతం పరిగెత్తుకొని వస్తాయి. చక్కగా వాటికి అరటి పండ్లు , వేరుశనగ విత్తనాలు, స్వీట్లు పెడతాడు. లాక్ డౌన్లో కూడా పోలీసుల వద్ద అనుమతి తీసుకొని ఆహారం అందించాడు. కోతులు, ఆవులు, కుక్కలు, కాకులు, పక్షులు, పిచ్చుకలు ఇలా అన్ని మూగజీవాలకు ఆహారాన్ని, నీటిని అందించడంలో భాష ముందు వరుసలో ఉన్నాడు. అంతేకాక పదకొండు ఏళ్ళగా ప్రతి ఆదివారం ఆటోలో తనే స్వయంగా అరటిపండ్లను, వేరుశనగ విత్తనాలను, స్వీట్లను, కొర్రలను తీసుకుని అడవికి వెళ్లి కోతులకు, ఆవులకు, పక్షులకు ఆకలి తీరుస్తున్నాడు. కోతులకు ఆవులకు స్వయంగా తినిపించి తన దాతృత్వాన్ని చాటుకుంటున్నాడు.

ప్రతి ఒక్కరూ తనలాగా మూగజీవాలను ఆదరించాలని అనేది భాషా కోరిక.. తాను చేస్తున్న సేవను చూసి సమాజంలో మరికొంతమందిలో మార్పు రావాలని భాషా ఆశిస్తున్నాడు. మూగ జీవాలు కూడా మనలో భాగమేనని , మనకు ఆకలి వేసినా దాహం వేసినా ఎవరో ఒకరిని అడిగి వాటిని పొందగలమని, కానీ మూగ జీవాలు అలా కావని పేర్కొంటున్నాడు. మూగజీవాలను, పక్షులను ప్రేమించాలని బాషా మోహిద్దీన్ కోరుతున్నాడు. అతనికి ఏడేళ్లుగా జీలాన్ అనే ఆటో డ్రైవర్ కూడా సహాకారం అందిస్తున్నాడు.

మనిషి మనుగడ ఎంత ముఖ్యమో మూగజీవాలు, పక్షుల మనుగడ కూడా అంతే అవసరం. అవి లేని నాడు మానవ జాతి కూడా అంతరించి పోతుంది.. అందుకే ప్రతి ఒక్కరు భాషా మోహిద్దీన్ లా కాక పోయినా కొద్దో గొప్పో సమయం కేటాయించి మూగ జీవాల మనుగడను కాపాడాలని కోరుకుందాం..

-సుధీర్, టీవీ9 తెలుగు రిపోర్టర్, కడప

Also Read:

Ramadan 2022: ముస్లిం ఉద్యోగులకు జగన్ సర్కార్ కానుక.. రంజాన్ ప్రారంభమైన నేపథ్యంలో కీలక నిర్ణయం..

Andhra Pradesh: మనసు మార్చుకున్న సీఎం జగన్.. కొత్త మంత్రివర్గంలో ఆ 10 మందిని కొనసాగించే చాన్స్!