నరసాపురం టూ హైదరాబాద్.. కోటికి పైగా నగదు పట్టివేత

| Edited By: Ravi Kiran

Sep 09, 2020 | 7:18 PM

హవాలా లావాదేవీలపై విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఏపీ నుంచి హవాలా మార్గంలో భారీగా నగదును హైదరాబాద్‌ తరలిస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టు కున్నారు.

నరసాపురం టూ హైదరాబాద్.. కోటికి పైగా నగదు పట్టివేత
Follow us on

హవాలా లావాదేవీలపై విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఏపీ నుంచి హవాలా మార్గంలో భారీగా నగదును హైదరాబాద్‌ తరలిస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టు కున్నారు. హవాలా నగదు కనిపించకుండా సీటు వెనుక ప్రత్యేక బాక్సుల్లో అమర్చి తరలించాలనే నిందితుల ప్రయత్నాన్ని భగ్నం చేశారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించిన పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన అన్నదమ్ములు అక్కడి దేవి జ్యువెలరీ మార్ట్‌లో కొంతకాలంగా పనిచేస్తున్నారు. దుకాణ యజమాని ప్రవీణ్‌ కుమార్‌ జైన్‌ వీరిరువురికీ రూ. 50 లక్షలు, 34 వేల అమెరికన్‌ డాలర్ల(సుమారు రూ. 25 లక్షల విలువ) హవాలా నగదును ఇచ్చి, విజయవాడకు చెందిన వల్లూరి శివనాథ్‌ వద్ద రూ. 50 లక్షలు, భరత్‌ వద్ద రూ. 20 లక్షలు, ఉత్తమ్‌ వద్ద రూ. 15 లక్షలు, దివాకర్‌ వద్ద రూ. 12 లక్షలు కూడా తీసుకుని హైదరాబాద్‌లో అందజేయాలని ఆదేశించాడు. ఎటువంటి బిల్లులు లేని ఈ మొత్తాన్ని హైదరాబాద్‌లో ఉండే తన సోదరుడైన కీర్తికి అందజేయాలని సూచించగా.. నిందితులు ప్రత్యేకంగా సీటు వెనుక బాక్సుల్లో దాచి తరలించే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో సమాచారం అందుకున్న విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వలపన్ని వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారు. బంగారం వ్యాపారి ప్రవీణ్‌ జైన్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు తరలిస్తున్న మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు దర్యాప్తు నిమిత్తం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులకు సమాచారం అందజేశారు.