ఏపీలో ఇసుక కొరతకు నిరసనగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ విజయవాడలో 12గంటల దీక్ష చేయనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి కాగా.. ఉదయం 8 గంటలకు ఆయన దీక్షలో కూర్చోనున్నారు. ఇక ఈ దీక్షకు జనసేన, సీపీఐ, సీపీఎం, ఆప్ పార్టీలు సంఘీభావాన్ని తెలిపాయి. ఇదిలా ఉంటే బాబు చేపడుతున్న దీక్షకు పోటీగా తాను కూడా దీక్ష చేపడతానని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ప్రకటించారు.
తాను ఇసుక దాచాను అని చంద్రబాబు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. దాచిన ఇసుకతో ఏం పనులు చేశానో వాటిపై బాబు ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. లేదంటే చంద్రబాబు దీక్ష చేసే వేదికకు దగ్గర్లోనే తాను కూడా నిరసన చేస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో ధర్నా చౌక్ వద్ద తన దీక్షకు అనుమతించాలని హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులను ఆయన కోరారు. అలాగే నగర పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. కానీ ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఉద్రిక్తతలకు తావొద్దన్న కారణంగానే ప్రభుత్వం పార్థసారథి దీక్షకు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది.