Amaravati protest : అమరావతి మహిళలు కదం తొక్కారు. మూడు రాజధానులను వెనక్కి తీసుకోవాలంటూ మరోసారి తమ గళం విప్పారు. అందుకోసం ప్రకాశం బ్యారేజ్‌ను వేదిక చేసుకునేందుకు యత్నించిన రైతులను.. గ్రామాల్లోనే పోలీసులు నిర్బంధించారు. ఆందోళన పిలుపుతో .. అప్రమత్తమైన పోలీసులు వారి ఆవేశాన్ని కట్టడిచేశారు. దాంతో రాజధాని పోరు మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ అమరావతి మహిళలు కొత్త రకం నిరసన చేపట్టారు. తమ ఉద్యమాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు అమరావతి మహిళలు ప్రకాశం బ్యారేజీపై కవాతుకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తెల్లవారుజామునుంచే రాజధాని గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎవరిని రోడ్డుపైకి రాకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ మందడంలో మహిళలు రోడ్డుపై బైఠాయించారు. బ్యారేజీకిపైకి వెళ్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
కవాతుకు పిలుపుతో అమరావతి పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. ఎక్కడికక్కడ భారీకేడ్లు ఏర్పాటుచేసినా కొన్ని చోట్లు ముందుకు పోయేందుకు ప్రయత్నించారు. అలా ముందుకెళ్లే వారిని అడ్డుకునే క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రుడా ఆలకించు..ఆడపడుచు ఆక్రందన అంటూ గళమెత్తారు మహిళలు. కొంతమంది రైతులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులతో గొడవకు దిగారు. నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేదా అంటూ నిలదీశారు. మందడం శివాలయం సెంటర్‌లో మహిళలు రోడ్డుపై బైటాయించారు. పోలీసుల తీరును ఎండగడుతూ.. పురుగుల మందు డబ్బాలను వెంటతెచ్చుకున్నారు. అల్పాహారంలో కలుపుకుని సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడంతో.. పోలీసులు అలర్ట్ అయి వారి నుంచి పురుగుల మందులను లాక్కున్నారు.
నిరసనలో పాల్గొన్న కొందరు రైతులు.. వెలగపూడిలోని సచివాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో కొందరు మహిళలు కిందపడిపోయారు. ఏడాదిగా నిరసనలు తెలిపినా.. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Read also : Gold features : ధరలు తగ్గుతున్నాయి.. బంగారం కొనేందుకు ఇది సరైన సమయమేనా? కొన్నాళ్లు ఆగితే బెటరా?