Chandrababu Naidu : అమరావతిని కాపాడేందుకు ఇంటికొకరు బయటకు రావాలని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆదివారం విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. మీరు ఇంట్లో పడుకుంటే నేను అమరావతి కోసం పోరాడాలా అంటూ చంద్రబాబు ఈ సందర్భంలో ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి కొడాలిపై చంద్రబాబు తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఒకడు బూతుల మంత్రి… నోరు పారేసుకుంటాడు.. పేకాట ఆడిస్తాడు. ఆడితే తప్పేముంది అంటాడు. ఎంత సింపుల్ సమాధానమిది అంటూ కొడాలి నానిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సదరు మంత్రి తాడేపల్లిలో సీఎం దగ్గరకు వెళ్లి దర్జాగా బయటకు వస్తాడు. అంటే సీఎం ఆశీస్సులు తీసుకున్నట్టా? అంటూ బాబు ప్రశ్నించారు.
మేయర్ పదవిని సాధించాలని, లేదంటే విజయవాడ జనం తలెత్తుకు తిరగలేరన్నారు చంద్రబాబు. నేరస్థుల అడ్డాగా ఆంధ్రాను తయారు చేస్తున్నారని.. పేదోళ్లకు కనీసం ఐదు రూపాయల భోజనం పెడుతుంటే… టీడీపీకి పేరొస్తుందనే భయంతో.. అన్నా క్యాంటీన్‌లను నిరుపయోగం చేశారని చంద్రబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ మెడలు వంచుతా అన్నాడు… ప్రత్యేక హోదా ఏమైంది? ఎవరికైనా న్యాయం జరిగిందా..? అని బాబు విజయవాడ వాసుల్ని ప్రశ్నించారు.