Andhra News: ఏపీలో “స్లాట్‌ బుకింగ్స్‌” ప్రారంభం..రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లకు జనాల క్యూ!

Andrapradesh: ఏపీలోని సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. భూ వివాదాలు, అవినీతి తగ్గించేందుకు ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్టు మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ప్రస్తుతం ఈ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు.

Andhra News: ఏపీలో స్లాట్‌ బుకింగ్స్‌ ప్రారంభం..రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లకు జనాల క్యూ!
Ap Registration Office

Updated on: Apr 04, 2025 | 1:45 PM

రిజిస్ట్రేషన్ వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఏపీ ప్రభుత్వం ఓ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలోని సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం కొత్త విధానంగా స్లాట్ బుకింగ్ వ్యవస్థను మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రారంభించారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని ప్రధాన సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం ద్వారా ప్రజలు ఆన్‌లైన్‌లో స్లాట్‌ను బుక్ చేసుకుని, నిర్ణీత సమయంలో కార్యాలయానికి వెళ్లి తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ కొత్త విధానం వల్ల కార్యాలయాల్లో రద్దీ తగ్గడంతో పాటు, పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన కార్యాలయాల్లో కూడా త్వరలో ఈ విధానాన్ని విస్తరించే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. నిరు పేదలకు అండగా ఉంటూ..వారికి న్యాయం చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని..ఈ మేరకే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్టు ఆయన తెలిపారు. ఇలాంటి కొత్త సంస్కరణలతో రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం ఉండదని మంత్రి అనగాని స్పష్టం చేశారు. ఇక మీద రిజిస్ట్రేషన్‌ల కోసం రోజులు తరబడి వేచి చూసే అవసరం లేదన్నారు. అమ్మకదారులు, కొనుగోలుదారులు, సాక్షులు.. ఇలా ఎవరికీ ఇబ్బంది లేకుండా స్లాట్ బుకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంటుందన్నారు. భూ వివాదాలు లేకుండా కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. అభివృద్ధి కోసమే నాలా చట్టాన్ని తీసేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చామన్నారు. మంచి ఫలితాలు అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకెళ్తొందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..