AP High Court: వారు క్రైస్తవంలోకి చేరిన వెంబడే.. ఆ చట్టాల నుంచి రక్షణ కోల్పోతారు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు!

తనను కులం పేరుతో దూషించి, తనపై దాడికి పాల్పడ్డారని ఓ పాస్టర్‌ పెట్టిన కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ కులానికి చెందిన వ్యక్తులు క్రైస్తవ మతంలోకి చేరన వెంబడే ఎస్సీ హోదాను కోల్పోతారని కోర్టు తేల్చిచెప్పింది. ఇక క్రైస్తవ మతంలో చేరిన నాటి వారు ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని హైకోర్టు స్పష్టంచేసింది.

AP High Court: వారు క్రైస్తవంలోకి చేరిన వెంబడే.. ఆ చట్టాల నుంచి రక్షణ కోల్పోతారు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు!
Ap High Court

Updated on: May 02, 2025 | 2:34 PM

ఉమ్మడి గుంటూరుడ జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చింతాడ ఆనంద్‌ అనే పాస్టర్.. తనను కొందరు వ్యక్తులు కులం పేరుతో దూషించడంతో పాటు తనపై దాడికి పాల్పడ్డారని 2021లో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాస్టర్‌ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు, ఆ గ్రామానికి చెందిన ఎ.రామిరెడ్డి సహా మరో ఐదుగురి వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితులు కేసును కొట్టేయాలంటూ గతంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కేసులో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ కేసుపై తాజాగా ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితుల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినింపించారు.

అయితే ఈ కేసు విచారణ సంద్భంగా నిందితుల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి కీలక విషయాలను తీసుకెళ్లారు. తమ క్లైంట్‌పై ఫిర్యాదు చేసిన వ్యక్తి పదేళ్లుగా పాస్టర్‌గా పనిచేస్తున్నారని.. క్రైస్తవ మతంలోకి చేరిన వ్యక్తులకు ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని వాదనలు వినిపించారు. భారత రాజ్యంగం ప్రకారం, ఎస్సీ కులం వారు, హిందూమతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించినట్లయితే.. తమ ఎస్సీ హోదాను కోల్పోతారని తెలిపారు. క్రైస్తవ మతం కులవ్యవస్థలను గుర్తించదని.. ఎవరైతే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తారో ..వారు ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని ఈ కేసును కొటివేయాలని పేర్కొన్నారు.

ఇక పాస్టర్‌ ఆనంద్‌ తరఫు వాదనలను వినిపించిన న్యాయవాది.. చింతాడ ఆనంద్  ఒక ఎస్సీ అని ఎమ్మార్వో ధ్రువపత్రం ఇచ్చినట్టు కోర్టుకు తెలిపారు. ఇక నిందితుల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద పాస్టర్ రక్షణ పొందలేరని.. నిందితులపై పోలీసులు నమోదు చేసి సెక్షన్లు చెల్లుబాటు కావని తిర్పు ఇచ్చింది. దీనితో పాటు ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. బాధితులపై నమోదైన కేసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…