కృష్ణాతీరంలో ఒక్కసారి రాజకీయ కలకలం రేగింది. క్షణాల వ్యవధిలోనే ఇద్దరు నేతలు తెలుగుదేశానికి షాకిచ్చారు. ఒకరు విమర్శలు జోలికి పోకుండా వైసీపీ కండువా కప్పేసుకున్నారు. మరొకరు మాత్రం అధినేతను, ఆయన తనయుడిని ఓ రేంజ్‌లో తిట్టి మరీ… అధికార పార్టీకి జై కొట్టారు. వల్లభనేని వంశీ నిర్ణయంతో ఏపీ రాజకీయంలో ఎలాంటి మార్పు రాబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇన్నాళ్లు సైలెన్స్ మెయింటేన్ చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన డైలాగులతో పొలిటికల్ బ్లాస్ట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన తనయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను ఓ రేంజ్‌లో టార్గెట్ చేశారు. టీడీపీపై ప్రజల్లో విశ్వాసం పోయిందన్నారు. వర్థంతికి, జయంతికి తేడా తెలియని వాళ్లు పార్టీని నడుపుతున్నారని లోకేష్‌పై సెటైర్లు వేశారు. ఇబ్బంది ఉన్నా పార్టీ న్యాయం చేయలేదని, సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏ రోజూ ఎమ్మెల్యేలను పట్టించుకోలేదని, జూనియర్ ఎన్టీఆర్‌ను ఎదగనీయకుండా తొక్కేశారని తీవ్ర ఆరోపణలే చేశారు వంశీ. ప్రభుత్వం మంచి చేస్తుంటే ఆరు నెలలు ఆగలేరా? అంటూ చంద్రబాబు తీరును తప్పుబట్టారు. వరదల్లో ఇసుక తీసే టెక్నాలజీ మీ దగ్గర ఉందా? అంటూ ప్రశ్నించారు. స్కూళ్లల్లో ఇంగ్లీషు మీడియాన్ని సమర్థించారు. తన నియోజకవర్గ ప్రజల కోసం వైసీపీలో చేరతానని ప్రకటించారు వంశీ.
ఇక ఇదే అంశంలో బిగ్ న్యూస్-బిగ్ డిబేట్ వేదికగా టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఆధ్వర్యంలో కీలక చర్య జరిగింది. ఈ డిష్కషన్‌లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాపై తీవ్ర విమర్శలు చేశారు. అతను ఉన్నంతకాలం టీడీపీ పార్టీ బ్రతకదని పేర్కొన్నారు. తన నియోజకవర్గ అభివృద్దిని..ఉమా అడ్డుకున్నారని వంశీ ఆరోపించారు.