ఏపీ వ్యాప్తంగా అర్హులైన పేదలకు రాజధాని అమరావతిలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అవసరమైన చట్టసవరణలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టాల సవరణకు ఆమోదముద్ర వేస్తున్నట్లు తెలుపుతూ గవర్నర్ పేరిట నోటిఫికేషన్ జారీ అయింది. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఇళ్ల పథకాలు రాజధాని ప్రాంతంలోని వారికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర జిల్లాల్లోని అర్హులైన వారికి కూడా కేటాయించేలా కొద్దినెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఈ విషయంలో సంబంధిత పాలకవర్గంతో పాటు ప్రత్యేకాధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్టాన్ని కూడా సవరించింది. దీంతో పాటు మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. తాజాగా వీటికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో అర్హులైన పేదలకు రాజధానిలో ఇళ్లు కేటాయించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. గవర్నర్ ఆమోదంతో అమరావతిలో పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా నిరుపేదలకు ఉచిత ఇళ్ల స్థలాలు కేటాయింపులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది.
కాగా క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) చట్టం, 2014, మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ (మృడా) చట్టం, 2016 కింద చేసిన సవరణలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం ఆమోదం తెలిపారు. నూతన సవరణలతో రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అమరావతిలో రాష్ర్ట ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వాలు అందించే గృహ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సవరణలకు ముందు అమరావతిలో గృహ నిర్మాణ పథకాలను రాజధాని నగరం, రాజధాని ప్రాంత పరిధిలోని గ్రామాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. దీంతో పాటు అమరావతి కోసం ఉద్దేశించిన MRUDA చట్ట సవరణతో రాజధాని మాస్టర్ ప్లాన్, మాస్టర్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ ప్రణాళికలు, రాజధానిలో జోనల్ ఏరియా డెవలప్ మెంట్ అవసరమైన మార్పులు చేపట్టనుంది.