గురువారం ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎంగా నెలకు రూపాయి జీతం మాత్రమే ఆయన తీసుకోనున్నట్లు సమాచారం. ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని ఖజానాకు తన జీతం భారం కాకూడదని ఆయన భావిస్తున్నారట. జగన్ బాటలోనే కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు నడిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జీతం విషయలో వైఎస్ జగన్ ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి మాత్రమే వేతనంగా తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎం వేతనం నెలకు రెండున్నర లక్షల రూపాయలు ఉంది. జీతంతో పాటు ఇతర అలవెన్సులు అన్నీ కలిపితే నాలుగైదు లక్షల దాకా వస్తుంది. మంత్రులుకు కూడా సీఎంతో సమానంగా వేతనం, అలవెన్సులు అందుతున్నాయి.
ఎక్కువ వేతనం తీసుకుంటున్న సీఎంల జాబితాలో కేసీఆర్ మొదటి స్థానంలో ఉన్నారు. కేసీఆర్ ఏకంగా నెలకు రూ.4,21,000 తీసుకుంటున్నారట. రెండో స్థానం ఉత్తరాఖండ్ సీఎం నెలకు రూ.2,50,000 చొప్పున జీతం తీసుకుంటున్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రూ.2,40,000 జీతం అందుకునేవారు.