బడ్జెట్‌లో ఆ కేటాయింపులు అమరావతి నిర్మాణానికి కాదు.. ఏపీ సర్కారు వివరణ

Andhra Pradesh Budget 2025: ఏపీ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6000 కోట్లు కేటాయించినట్లు కొన్ని మీడియాల్లో ప్రచారం జరిగింది. దీనిపై వివరణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని స్పష్టంచేసింది. బడ్జెట్‌లో కేటాయించిన రూ.6000 కోట్లు ఎందుకు వినియోగిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.

బడ్జెట్‌లో ఆ కేటాయింపులు అమరావతి నిర్మాణానికి కాదు.. ఏపీ సర్కారు వివరణ
Amaravati

Updated on: Mar 01, 2025 | 8:12 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.6,000 కోట్లు కేటాయించినట్లు మీడియాలో వచ్చిన కథనాలపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అమరావతి నిర్మాణం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు జరుగుతున్న ప్రచారం లేదా వార్తలు అవాస్తవమని స్పష్టంచేసింది. అమరావతి కోసం బడ్జెట్లో కేటాయించిన రూ.6,000 కోట్లు రాజధాని నిర్మాణానికి కాదని ప్రభుత్వం స్పష్టంచేసింది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించేందుకు ఈ కేటాయింపులు చేసినట్లు తెలిపింది. అలాగే రాజధాని ప్రాంతంలో సామాజిక భద్రతా నిధి, రాజధానిలో భూమిలేని పేదలకు పింఛన్ల చెల్లింపు, ఇతర సామాజిక అవసరాల కోసం ఈ నిధుల్ని వెచ్చించనున్నట్లు వివరణ ఇచ్చింది. అమరావతి నిర్మాణానికి రూ.6000 కోట్లు కేటాయించినట్లు ప్రకటించడం ద్వారా ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పచ్చి అబ్ధం చెప్పారని కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలను ఏపీ సర్కారు తోసిపుచ్చింది.

అంతేతప్ప రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఏపీ సర్కారు స్పష్టంచేసింది. ఎందుకంటే అమరావతి ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టుగా ఉంటుందని పేర్కొంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతికి నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపింది. ఆ రుణాలను CRDA తీర్చుకుంటుందని స్పష్టంచేసింది. కాబట్టే బడ్జెట్లో రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించలేదన్న విషయాన్ని గ్రహించాలని ఏపీ సర్కారు తెలిపింది.

అమరావతికి బడ్జెట్ కేటాయింపులపై ప్రభుత్వ వివరణ..