
కొత్త ఇంటి వివాదం ఓ యువతి ప్రాణాన్ని తీసింది.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఈ జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. జగ్గయ్యపేటకు చెందిన ప్రవళిక, షేర్ మహమ్మద్ పేటకు చెందిన చలమల సుభాష్ చంద్రబోస్ తో గత ఏడాది కాలంగా సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో జగ్గయ్యపేట శాంతినగర్‌లో ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇంటిని ప్రవళిక పేరుతో అగ్రిమెంట్ చేసిన సుభాష్ రిజిస్ట్రేషన్ మాత్రం తన తల్లి పేరు మీద చేయించాడు. ఈ విషయం బయటపడటంతో ప్రవళిక, సుభాష్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొత్త ఇంటి యాజమాన్యం విషయమే జరిగిన ఈ గొడవే విషాదానికి దారి తీసింది. తీవ్ర మనస్తాపానికి గురైన ప్రవళిక, కొత్త ఇంటిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమికంగా స్పాట్‌లో లభించిన క్లూసులు సేకరించిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే ప్రవళిక కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యనని ఆరోపిస్తున్నారు. కొత్త ఇంటి విషయంలో జరిగిన వివాదంలో సుభాష్ కుటుంబం సభ్యులు ప్రవళికను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. కేవలం కొత్త ఇంటి కోసమే ప్రవళికను చంపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో స్థానిక పోలీసులు నిరాశ పరుస్తున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిష్పక్షపాతంగా అన్ని కోణాలలో దర్యాప్తు జరిపి, ప్రవళికకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు..
అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాలలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదికతో పాటు పరిసరాల్లోని సిసి ఫుటేజ్ కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..