
సాధారణంగా పాము కనిపిస్తేనే పెద్దవాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అలాంటిది కెరీర్‌కు ఎంతో కీలకమైన పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల మధ్యలోకి ఒక పెద్ద పాము వస్తే.. ఆ భయం ఎలా ఉంటుందో ఊహించలేం. సరిగ్గా ఇలాంటి ఘటనే కడప జిల్లాలో చోటుచేసుకుంది. కడప జిల్లా బి. కోడూరు మండలంలోని పదో తరగతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులు నిశ్శబ్దంగా పరీక్ష రాస్తున్నారు. ఆ సమయంలో గదిలో ఉన్నట్టుండి వింత శబ్దాలు రావడంతో విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. గమనించగా.. ఒక పెద్ద పాము గదిలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురై, ప్రాణభయంతో పరీక్షా పత్రాలను వదిలేసి గది బయటకు పరుగులు తీశారు.
విద్యార్థుల అరుపులతో పరీక్షా కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది ఆ పామును పట్టుకుని చంపివేయడంతో ముప్పు తప్పింది. అనంతరం విద్యార్థులు కాస్త తేరుకుని, మళ్ళీ పరీక్షా గదిలోకి వెళ్లి మిగిలిన పరీక్షను పూర్తి చేశారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని, ఇలాంటి సమయంలో పాములు రావడం వల్ల పిల్లలు మానసిక ఆందోళనకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
పరీక్షా కేంద్రాలను, వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని తల్లిదండ్రులు ప్రశ్నించారు. చదివిందంతా మర్చిపోయేలా ఇలాంటి భయానక సంఘటనలు జరగడం వల్ల విద్యార్థులు పరీక్షలు సరిగ్గా రాసే అవకాశం ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా విద్యాశాఖ అధికారులు స్పందించి, పరీక్షా కేంద్రాల వద్ద ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.