Nithyananda: స్వామి నిత్యానందకు భారీ షాక్‌.. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస ఒప్పందం రద్దు.. అసలు కారణం ఇదే..

కంట్రోవర్సీకి కేరాఫ్‌ అడ్రస్‌ స్వామి నిత్యానంద. ఇండియాలో ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా దేశం వదలిపారిపోయారు. కల్పిత దేశాన్ని ఏర్పాటు చేసుకొని అంతా తానేనని ప్రకటించుకున్నారు. అంతే కాదు తమను అమెరికా గుర్తించిందని ఘనంగా ప్రచారం చేసుకున్నారు. ఐక్యరాజ్యసమితిలోనూ తమకు ప్రాతినిధ్యం ఉందని చెప్పుకున్నారు. కాని, ఒక్కొక్కటిగా నిత్యానందకు చెందిన దేశం గురించి విషయాలు బయటకు వస్తున్నాయి.

Nithyananda: స్వామి నిత్యానందకు భారీ షాక్‌.. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస ఒప్పందం రద్దు.. అసలు కారణం ఇదే..
Nithyananda

Updated on: Mar 05, 2023 | 6:10 PM

యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస USK అనే కల్పిత దేశంతో గొప్పలు పోతున్న స్వామి నిత్యానందకు ఊహించని షాక్‌ తగిలింది. అది కూడా అలాంటి, ఇలాంటిది కాదు అమెరికా నుంచి. జనవరి 11న యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాసకు అమెరికాలో అతి పెద్ద నగరాల్లో ఒకటైన నెవార్క్‌ మధ్య సిస్టర్‌ సిటీ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పంద కార్యక్రమాన్ని స్వామి నిత్యానందకు చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసింది. దాని గురించి ఘనంగా ప్రచారం చేసుకుంది. ఆ తర్వాత యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్ కైలాస USKకు ఉన్న పేరు, దాని చుట్టు ఉన్న వివాదాల గురించి తెలుసుకgన్న నెవార్క్‌ నగరం నాలిక కరుచుకుంది. స్వామి నిత్యానందకు చెందిన దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇది జరిగి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికే నెవార్క్‌తో కుదిరిన ఒప్పందాన్ని కైలాస దేశం ఘనంగా ప్రచారం చేసుకుంటోంది.

అత్యాచారం, నిర్బంధం వంటి కేసులు ఎదుర్కొంటున్న నిత్యానంద 2019లో ఇండియా నుంచి పారిపోయారు. ఒక కాల్పానిక దేశాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి తన కార్యకలాపాలు సాగిస్తున్నారు. గత నెల జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ సమావేశంలో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్ కైలాస ప్రతినిధులు ఇద్దరు ప్రేక్షకులుగా హాజరయ్యారు.

ప్రేక్షకులుగా ప్రశ్నలు అడిగి దాన్ని తమకు అనుకూలంగా మల్చుకున్నారు. యునైటెడ్‌ నేషన్స్‌ తమను గుర్తించిందని USK తప్పుడు ప్రచారం చేసుకుంటోంది. నిత్యానంద వేధింపులకు గురవుతున్నారని, స్వదేశం నుంచి బహిష్కరణకు గురయ్యారంటూ USK ప్రతినిధిగా చెప్పుకుంటున్న విజయప్రియ చేసిన ప్రసంగాన్ని UNO మానవహక్కుల కమిషన్‌ కొట్టిపారేసింది.

నిత్యానంద ఏర్పాటు చేసుకున్న దేశం ఎక్కడుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. కాని తమ దేశానికి సొంత కరెన్సీ, సొంత పౌరసత్వం, సొంత ప్రభుత్వం ఎన్నో ఉన్నాయని ఆ దేశ వెబ్‌సైట్‌ ఘనంగా చెప్తోంది. నిత్యానంద ఫాలోవర్స్‌ మాత్రం కైలాస దేశం నుంచి విపరీతంగా ప్రచారం చేస్తూ ఉంటారు.

అంతర్జాతీయ ప్రతినిధులతో కలిసిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో షేర్‌ చేస్తూ ఉంటారు. ఈక్వెడర్‌ దేశానికి సమీపంలోకి దీవుల్లో ఒకదాన్ని కొనుగోలు చేసి తన దేశాన్ని ఏర్పాటు చేశానని నిత్యానంద అంటున్నారు. కాని తమ దేశ పరిసరాల్లో ఎక్కడా నిత్యానంద దేశం లేదని ఈక్వెడర్‌ స్పష్టం చేసింది.

మరిన్ని అంతార్జీతీయ వార్తల కోసం