Gorillas test positive for coronavirus : అగ్రరాజ్యం ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా అతలాకుతలం అవుతోంది. నిత్యం వేలాది కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు మనవులనే వణికించిన వైరస్.. జూపార్క్‌లోని మూగ జీవాలను సైతం వదలడంలేదు. తాజాగా అమెరికాలోని శాన్‌డియాగో నగరంలో ఉన్న సఫారీ పార్కులో గొరిల్లాలకు కరోనా సోకింది. జూలో ఒకే చోట కలిసి ఉంటున్న ఎనిమిది గొరిల్లాలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పార్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లీసా పీటర్సన్ చెప్పారు. మరికొన్ని గొరిల్లాలు కూడా అనారోగ్యం బారినపడ్డట్లు ఆయన వెల్లడించారు. త్వరలో వాటికి కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. అటు కాలిఫోర్నియా రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉంది. ఈనేపథ్యంలో డిసెంబరు 6 నుంచి లాక్‌డౌన్ విధించడంతో ఈ పార్కు సైతం మూసేశారు అధికారులు. సందర్శకులు ఎవరిని జూపార్క్‌లోకి అనుమతించడం లేదు. అయితే, జూ పార్క్‌లో గొరిల్లాలకు దగ్గరగా పనిచేసే సిబ్బందిలో ఒకరు ఇటీవల కొవిడ్-19 బారినపడ్డారు. ఆ వ్యక్తి నుంచే వాటికి వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అనారోగ్య లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్షలు నిర్వహించారు జూ అధికారులు. దీంతో వాటికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యినట్లు లీసా పీటర్సన్ తెలిపారు. గొరిల్లాలకు కరోనా సోకడం అమెరికాలోనే కాక ప్రపంచంలోనే ఇదే తొలిసారి కావొచ్చని జంతు వైద్య నిపుణులు అంటున్నారు. మనుషులు, గొరిల్లాల డీఎన్‌ఏలలో 98.4 శాతం సారూప్యతలు ఉంటాయన్నారు.
Read Also… ప్రపంచ కరోనా అప్‌డేట్… ఒక్క రోజులో 6,64,911 పాజిటివ్ కేసులు, 15,809 మరణాలు…