తనను అభిశంసించాలంటూ డెమొక్రాట్లు చేస్తున్న ప్రయత్నాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పు పట్టారు. ఇది తనకే కాక, తన కుటుంబానికే దెబ్బ అన్నారు. లూసియానాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఈ ప్రక్రియను ప్రారంభించిన డెమోక్రెటిక్ ఇన్వెస్టిగేటర్లను దుయ్యబట్టారు. ఇదంతా తనపై పగబట్టి చేబట్టిన వ్యవహారంగా అభివర్ణించారు. అసలు ఇంపీచ్ మెంట్ అన్నది తనకు నచ్ఛని చెత్త పదమని , ఇది అసహేతుకమైనదని అన్నారు. అయితే నేను మళ్ళీ అధ్యక్ష పదవికి ఎన్నిక కావడానికి ఇది ఒక విధంగా ‘ వరం ‘ గా కూడా మారవచ్చునన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వంతో నేను ఎలాంటి డీలింగూ చేయలేదు. మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్, ఆయన కుటుంబంపై దర్యాప్తు జరపాల్సిందిగా ఆ ప్రభుత్వాన్ని కోరే అవసరమే నాకు లేదు.. అసలు నేను ఎలాంటి తప్పూ చేయలేదు ‘ అన్నారాయన. నాకు ఎలాంటి అనుభవం లేకపోయినా బుష్, క్లింటన్, ఒబామా వంటి వారిని పక్కకు నెట్టాను.. అధ్యక్ష ఎన్నికల్లో నేను సాధించిన విజయమే ఇందుకు నిదర్శనం అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా-ట్రంప్ అభిశంసనకు సంబంధించి పబ్లిక్ హియరింగ్స్ బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలుత ఉక్రెయిన్ కు యుఎస్ మాజీ రాయబారి యవనోవిచ్ వాంగ్మూలమిచ్చారు. అందులో ఆమె.. ట్రంప్ పై కన్నా, తనను పదవి నుంచి తొలగించడానికి జరిగిన యత్నాలను ఏకరువు పెట్టారు. ట్రంప్ సన్నిహితుల్లోనే కొందరు ఇందుకు కారకులని ఆరోపించారు.