అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రతిపక్షాలు ట్రంప్ లొసుగులను బయటబయలు చేస్తున్నాయి. వాణిజ్య అంశంలో డ్రాగన్ దేశం చైనాను ట్రంప్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అమెరికా అధ్యక్షుడికి చైనాలో బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్స్ మేనేజ్మెంట్ ఆ అకౌంట్‌ను ఉపయోగిస్తున్నట్లు ఆ పత్రిక తెలిపింది.
2013 నుంచి 2015 వరకు చైనాలో ట్రంప్ పన్ను కూడా చెల్లించినట్లు పేర్కొంది. ఆసియాలో హోటల్ వ్యాపారాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో ఆ అకౌంట్‌ను ఓపెన్ చేసినట్లు ట్రంప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వ్యాపార ఘర్షణలపై ఇటీవల ట్రంప్ విరుచుకుపడుతున్నారు. ట్రంప్ ట్యాక్స్ రికార్డులను పరిశీలించిన తర్వాత.. ఆయనకు చైనాలో అకౌంట్ ఉన్నట్లు తేలిందని పత్రిక తన కథనంలో పేర్కొంది. చైనా అకౌంట్ ద్వారా స్థానికంగా ట్రంప్ సుమారు 1,88,561 డాలర్ల పన్ను చెల్లించినట్లు తెలుస్తోంది. కానీ, అమెరికాలో మాత్రం కేవలం 750 డాలర్లు మాత్రమే పన్ను చెల్లించిన ట్రంప్‌పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.