కరోనాను ఖాతరు చేయకుండా కాసేపు బయట తిరిగిన ట్రంప్‌

|

Oct 05, 2020 | 10:33 AM

కరోనా సోకడంతో సైనిక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోవిడ్‌ నిబంధనలను తుంగలో తొక్కారన్న విమర్శలు వస్తున్నాయి.. అందుకు కారణం తనకోసం వాల్టర్‌ రీడ్‌ హాస్పిటల్...

కరోనాను ఖాతరు చేయకుండా కాసేపు బయట తిరిగిన ట్రంప్‌
Follow us on

కరోనా సోకడంతో సైనిక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోవిడ్‌ నిబంధనలను తుంగలో తొక్కారన్న విమర్శలు వస్తున్నాయి.. అందుకు కారణం తనకోసం వాల్టర్‌ రీడ్‌ హాస్పిటల్‌ ముందు ఎదురుచూస్తున్న తన మద్దతుదారుల కోసం కొద్ది సేపు బయటకు రావడమే! చికిత్స తీసుకుంటున్న ఆయన ఆసుపత్రిలోనే ఉండక, ఆవరణలో కాసేపు కారులో చక్కర్లు కొట్టారు.. తన మద్దతుదారులకు అభివాదం చేశారు.. తన ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని సంజ్ఞలతో తెలిపారు.. తనకోసం బయట వేచి చూస్తున్న అభిమానులు గొప్ప దేశ భక్తులని అన్నారు..
ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న వార్తల నేపథ్యంలో ఇలా ట్రంప్‌ బయటకొచ్చి బాగానే ఉన్నానని చెప్పడం కాసింత కన్ఫ్యూజన్‌ను కలిగించింది.. ట్రంప్‌ ఆరోగ్యపరిస్థితిపై శ్వేతసౌధం వాస్తవాలను దాచిపెడుతున్నదా? ట్రంప్‌కు వైద్యం అందిస్తున్న డాక్టర్‌ సియాన్‌ కాన్లే ఎందుకు కొన్ని విషయాలను వెల్లడించడం లేదు? అసలు వాల్టర్‌ రీడ్‌ ఆసుపత్రికి ఎందుకు తరలించాల్సి వచ్చింది? ట్రంప్‌కు రెండోసారి ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయినందుకే డెక్సా మెథాసోన్‌ అనే స్టెరాయిడ్‌ను అందచేశామని కాన్లే అంటున్నారు.. ఇది కేవలం తీవ్ర లక్షణాలు ఉన్న వారిలో మాత్రమే పనిచేస్తుందని గతంలో డాక్టర్లు పేర్కొన్నారు. ట్రంప్‌కు కరోనా లక్షణాలు మైల్డ్‌గానే ఉంటే ఎందుకు డెక్సా మెథాసోన్‌ను వాడినట్టు? స్వల్ప మోతాదు లక్షణాలు ఉన్న వారికి ఇది ఏ మాత్రం ఉపయోగపడదని డాక్టర్లు అంటుంటే మరి కాన్లే ఎందుకలా అంటున్నారు.. ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై వాస్తవాలు చెప్పడం లేదన్నది నిజమేనా? ఇలా అమెరికా అధ్యక్షుల ఆరోగ్యపరిస్థితిపై నిజాలు చెప్పకపోవడమన్నది కొత్తేమీ కాదు.. గతంలో చాలా సార్లు ఇలా అధ్యక్షుల ఆరోగ్య సమాచారాన్ని దాచిపెట్టారు. 1919లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఉడ్రూ విల్సన్‌కు స్పానిష్‌ ఫ్లూ సోకింది.. ఆ వ్యాధి అంటుకున్నప్పుడు ఆయన పారిస్‌లో ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్థం ముగింపుపై చర్చలు జరుపుతున్నారు.. అయితే విల్సన్‌ పర్సనల్‌ డాక్టర్‌ మాత్రం స్పానిష్‌ ఫ్లూ అని చెప్పకుండా విల్సన్‌కు విష ప్రయోగం జరిగిందంటూ వైట్‌ హౌజ్‌కు సమాచారం ఇచ్చారు.. దీనివల్ల ఒనగూడే ప్రయోజనం ఏమిటో తెలియదు. స్పానిష్‌ ఫ్లూ అంటే అమెరికా వణికిపోతుందని అలా చెప్పారేమో! రోనాల్డ్‌ రీగన్‌ విషయంలోనూ ఇలాగే అధికారులు అబద్ధాలాడారు. 1989లో రీగన్‌పై హత్యాయత్నం జరిగింది.. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.. ఈ విషయాన్ని వైట్‌హౌజ్‌ బయటకు తెలియనివ్వలేదు.. పైగా రీగన్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది.. రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన గ్రోవర్‌ క్లీవ్‌ల్యాండ విషయంలోనూ ఇంతే! ఆయనకు మౌత్‌ కేన్సర్‌ వచ్చింది.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఓ ప్రైవేటు షిప్పులో అర్థరాత్రి వేళ సర్జరీ చేయించుకున్నారు.. 1967లో అధ్యక్షుడిగా ఉన్న లిండన్‌ బీ జాన్సన్‌ కూడా తన చర్మ గాయానికి రహస్యంగానే శస్ర్త చికిత్స చేయించుకున్నారు. కెనెడీకి కూడా బోలెడన్నీ ఆరోగ్య సమస్యలు ఉండేవట! వాటి కోసం వివిధ రకాల మాత్రలు తీసుకునేవారట! ఆయన పదవీలో ఉన్నంత కాలం ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు.. ట్రంప్‌ కూడా తన ఆరోగ్య సమాచారాన్ని దాచిపెడుతున్నారేమోనన్న సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు కొందరు..!