నాలుగు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు అమెరికాలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. లూసియానా రాష్ట్రంలో మిసిసిపీ నది పొంగి ప్రవహించడంతో న్యూ ఓర్లీన్స్ నగరం వరదల్లో చిక్కుకుంది. పలు ఇళ్లు, వాహనాలు మునిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సహాయక చర్యలు చేపట్టిన స్థానిక ప్రభుత్వాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరంచాయి.
లూసియానా, వర్జీనియా, మేరీలాండ్, నార్త్ వెస్ట్రర్న్ డీసీ, సదరన్ మాంట్ గోమెరి కౌంటీ, ఫైర్ ఫాక్స్, ఈస్ట్ సెంట్రల్ డౌన్ కౌంటీ, అర్లింగ్‌టన్ కౌంటీ, ఫాల్స్‌చర్చ్, నార్తరన్ ఫెయిర్‌ఫాక్స్ కౌంటీలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడటంతో పలు నగరాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా లూసియానా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షం పర్యాటక నగరమైన న్యూ ఓర్లీన్స్‌లో బీభత్సం సృష్టించింది. ఇక్కడ మిసిసిపీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది ప్రవాహం సాధారాణంకన్నా.. 20 అడుగులు ఎత్తుకు చేరడంతో వరద నీరు రోడ్లను ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఇళ్లు, వాహనాలు నీట మునిగాయి. భారీ వర్షాలు, వరదలతో అనేక రోడ్లు నదులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగిపోయాయి. మరోవైపు టెక్సాస్ రాష్ట్రానికి తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యాయి. సహాయక చర్యల కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబోర్డ్ తెలిపారు.
రెండు రోజుల క్రితం భారీ వర్ష బీభ్సత్సానికి గురైన అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని పలు ప్రాంతాల్లో వరద నీరు ఇంకా నిలిచే ఉంది. పోటోమాక్ నది వరద నీటితో పొంగి ప్రవహిస్తోంది. 1871 తర్వాత అంతటి భారీ వర్షాలు ఇవేనని అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా వాతావరణ శాఖ హెచ్చిరంచింది. అత్యవసరం అయితేనే ఇంటి నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు.