అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాటిక్ అభ్యర్థిగా బరిలో ఉన్న కమలాదేవి హారిస్‌కు ఆమె సోదరి కూతురు మీనా హారిస్ పెద్ద చిక్కే తెచ్చి పెట్టారు.. నవరాత్రులను పురస్కరించుకుని దుర్గాదేవిగా కమలాహారిస్ మార్ఫింగ్ ఫోటోను మేనకోడలు ట్వీట్ చేశారు.. అమెరికాలో ఉంటున్న హిందువుల మనసు చూరగొనాలనే ఉద్దేశంతో మీనా హారిస్ మార్ఫింగ్ ఫోటో పెట్టి ఉంటారు కానీ అది బూమరాంగ్ అయ్యింది. ఆ ఫోటో చూసి అమెరికాలోని హిందూ సంఘాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన మీనా హారిస్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
హిందు సంఘాల ఆగ్రహాన్ని చూసిన మీనా హారిస్ ఆ ట్వీట్‌ను తొలగించారు.. మీరా హారిస్ పోస్ట్ చేసిన చిత్రంలో ఏముందంటే.. దుర్గాదేవిగా కమలాహారిస్ ఉన్నారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నేమో మహిషాసురుడిగా చిత్రీకరించారు. డెమొక్రాటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జో బైడెన్ ఏమో అమ్మవారి వాహనం సింహంగా చూపించారు. దుర్గామాత చిత్రాలతో కమలాహారిస్ మార్ఫింగ్ ఫోటో హిందువులను తీవ్రంగా బాధపెట్టిందని, ఇలా తమ ఓట్లను గెల్చుకోవాలనుకుంటే మాత్రం అది జరగని పని అని ప్రముఖ రచయిత షెఫాలీ వైద్య ట్విట్టర్‌లో తన నిరసన తెలిపారు. అలాగే హిందూ అమెరికన్ ఫౌండేషన్కు చెందిన సుహాగ్ ఏ శుక్లా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఫోటోను మీనా సృష్టించింది కాదనీ, ఆమె ట్వీట్‌కు ముందే ఇది వాట్సప్‌లో చక్కర్లు కొట్టిందని హిందూ అమెరికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి సభ్యుడు రిషి భుటాడా అంటున్నారు. అయినప్పటికీ తప్పు తప్పే కాబట్టి మీనా క్షమాపణలు చెప్పాల్సిందేనని చెబుతున్నారు.