
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఉగ్రవాదులు బరితెగించారు. నిర్మాణంలో ఉన్న ఒక ఉమ్మడి భద్రతా దళాల స్థావరాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనతో రాజధాని ఢాకాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, మే 31న బంగ్లాదేశ్ హోం మంత్రి సలాహుద్దీన్ ఈ సరికొత్త స్థావరాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే, ఈ ఉగ్రదాడిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం విశేషం.
బంగ్లాదేశ్‌కు చెందిన ‘ది డైలీ స్టార్’ పత్రిక కథనం ప్రకారం.. సోమవారం (మే 25) తెల్లవారుజామున సుమారు 1 గంట ప్రాంతంలో ఈ ఘాతుకం జరిగింది. చిట్టగాంగ్‌లోని సీతాకుండ జిల్లా, సలీంపూర్ అడవిలో ఉన్న రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB), పోలీసుల సంయుక్త శిబిరంపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఆధునిక ఏకే-47 తుపాకులతో సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
సైన్యం ఎదురుదాడికి దిగేలోపే, ఉగ్రవాదులు తమ పక్కా ప్రణాళికను అమలు చేశారు. సైనిక వాహనాలు అడవిలోకి రాకుండా నిరోధించడానికి చుట్టుపక్కల రహదారులపై పెద్ద పెద్ద గుంతలు తవ్వారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సైనిక స్థావరాన్ని బుల్డోజర్లతో పూర్తిగా నేలమట్టం చేశారు. ఆ సమయంలో శిబిరంలో కొద్దిమంది సైనికులు మాత్రమే ఉండటాన్ని వారు ఆసరాగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ దాడి వెనుక ‘యాసిన్ ఫోర్స్’ అనే ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు రాబ్-7 కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ హఫీజుర్ ధృవీకరించారు. ఉగ్రవాదులను అడ్డుకోవడానికి తాము 90 రౌండ్ల కాల్పులు జరిపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహరించి, సమగ్ర దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ ఘటన జరిగిన చిట్టగాంగ్ సమీపంలోని అటవీ ప్రాంతం సుమారు 3,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇదంతా కొండలు, లోయలతో కూడిన దుర్భేద్యమైన ప్రాంతం కావడంతో, దీనిపై బంగ్లాదేశ్ సైన్యానికి పూర్తి నియంత్రణ లేదు. 2021లో ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఈ ‘యాసిన్ ఫోర్స్’ చాలా కాలంగా ఈ అడవులపై ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ దుర్భేద్య ప్రాంతాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి బంగ్లాదేశ్ సైన్యం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..