యుద్ధానికి ముగింపా? అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు!

నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ఎంతో కాలంగా నలుగుతున్న ఇరాన్ అణు ఒప్పందంపై త్వరలోనే ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

యుద్ధానికి ముగింపా? అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు!
Us Secretary Of State Marco Rubio On Us Iran Deal,

Updated on: May 24, 2026 | 1:45 PM

నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ఎంతో కాలంగా నలుగుతున్న ఇరాన్ అణు ఒప్పందంపై త్వరలోనే ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

భారత విదేశాంగ అధికారిక ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు ముగిసిన అనంతరం జైశంకర్‌తో కలిసి మార్కో రూబియో మీడియాతో మాట్లాడారు. పశ్చిమాసియాలో శాంతిభద్రతల స్థాపనకు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఇరాన్ సమస్య ఒక కొలిక్కి రావడం ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అమెరికా మిత్రదేశాలతో కలిసి ముందడుగు వేస్తోందని, త్వరలోనే ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన వ్యూహాత్మక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో భాగంగా భారత్-అమెరికా రక్షణ, వాణిజ్య సంబంధాల బలోపేతంపై కీలక చర్చలు జరిగాయి. అంతర్జాతీయ పరిణామాలపై ఇరు దేశాలూ ఒకే తాటిపై ఉన్నాయని రూబియో పేర్కొన్నారు. “ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించడంలో భారత్ పాత్ర ప్రశంసనీయం. ఇరాన్ విషయంలో రాబోయే పరిణామాలు భారత్‌తో పాటు ప్రపంచ దేశాల ఇంధన భద్రతకు సానుకూలంగా మారనున్నాయి.” అని మార్కో రూబియో స్పష్టం చేశారు.

అమెరికా విదేశాంగ కార్యదర్శి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఇరాన్ అణు ఒప్పందం మళ్లీ పట్టాలెక్కితే, అది ప్రపంచ మార్కెట్‌కు మరియు ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారతదేశానికి ఎంతో ఊరటనిచ్చే అంశంగా మారనుంది.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ మరియు ఆ ప్రాంతంలోని ఇతర మిత్రదేశాలతో జరిపిన సంప్రదింపుల అనంతరం ఇరాన్‌తో శాంతి ఒప్పందం చాలా వరకు కుదిరిందని ప్రకటించారు. ఇది మూడు నెలలుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేస్తూ, అధికారిక ప్రకటనకు ముందు ఒప్పందం తుది వివరాలపై చర్చిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తాను విడిగా మాట్లాడానని, ఆ సంభాషణ చాలా బాగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఈ చర్చలను శాంతికి సంబంధించిన అవగాహన ఒప్పందంగా అభివర్ణిస్తూ, ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని ట్రంప్ అన్నారు. అయితే, హోర్ముజ్‌పై టెహ్రాన్ నియంత్రణను కొనసాగిస్తుందని చెబుతూ ఇరాన్ ఈ వాదనను తిరస్కరించింది. యుద్ధానికి ముందు స్థాయికి ఓడల రాకపోకలను పునరుద్ధరించడానికి మాత్రమే ఇరాన్ అంగీకరించిందని, కానీ దీని అర్థం మునుపటిలా స్వేచ్ఛా రాకపోకలకు తిరిగి రావడం ఎంతమాత్రం కాదని నివేదికలు సూచించాయి.

అయితే, ట్రంప్ పోస్ట్‌ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) కేవలం ప్రచారం అని కొట్టిపారేసిందని, టెహ్రాన్ అణు కార్యక్రమంపై ఎలాంటి హామీ ఇవ్వలేదని ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఒప్పందం దాదాపు ఖరారైందని అమెరికా అంటుండగా, ఇరాన్ మాత్రం ఆ వాదనలను పూర్తిగా అంగీకరించడం లేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us