
బరువు తగ్గాలనే ప్రయత్నంలో కొందరు చేసే పొరపాట్లు వారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. చైనాలో ఓ 31 ఏళ్ల మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. బరువు తగ్గేందుకు ఏకంగా 15 రోజుల పాటు ఆహారం పూర్తిగా మానేసింది. కేవలం నీళ్లు మాత్రమే తాగింది. దాంతో ఆమె దాదాపు 20 కిలోల బరువు తగ్గినా మెదడు వ్యాధికి గురైంది. ఆమె నడక పెంగ్విన్ పక్షిలా వింతలా మారింది.
15 రోజులు ఆహారం జోలికి వెళ్లకుండా కేవలం వాటర్ డైట్ చేసింది చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన ఆ మహిళ . 70 కిలోల బరువు నుంచి కొద్ది వారాల్లో దాదాపు 20 కేజీలు తగ్గింది. వాటర్ డైట్ మానేసి చాలా కొద్ది పరిమాణంలో ఆహారం తీసుకోవడం చేసింది.
గందరగోళానికి గురికావడం, జ్ఞాపకశక్తి తగ్గడం, కళ్లను సరిగ్గా కదిలించలేకపోవడం, శరీర సమతుల్యత కోల్పోవడం వంటి లక్షణాలు ఆమెలో మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు టెస్టులు చేసి ఆ మహిళకు వెర్నికె ఎన్సెఫలోపతి అనే నాడీ సంబంధిత వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు.
విటమిన్ B1 (థయామిన్) తీవ్రంగా లోపించిన వారిని వెర్నికె ఎన్సెఫలోపతి బాధిస్తుంది. పోషకాహార లోపం తీవ్రంగా ఉన్న సందర్భాల్లో వచ్చే ప్రమాదకరమైన నాడీ సంబంధిత వ్యాధి వెర్నికె ఎన్సెఫలోపతి. ఆ మహిళ భోజనం పూర్తిగా మానేయడంతో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందక మెదడు వ్యాధి సమస్యకు దారితీసినట్లు వైద్యులు తెలిపారు.
అంతేకాదు ఆ మహిళ నడక తీరు వింతగా మారింది. ఆమె అస్థిరంగా నడవడం మొదలుపెట్టింది. ఆమె నడిచే తీరు పెంగ్విన్ నడకలా మారినట్లు న్యూరాలజిస్ట్ గుయిఫాంగ్ మీడియాకు తెలిపారు. చికిత్స తర్వాత పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ.. నడకలో ఏర్పడిన సమస్యలు చాలా కాలం కొనసాగవచ్చని హెచ్చరించారు.
‘బిగు’ (Bigu) అనే పురాతన టావోయిస్ట్ విధానాన్నిపాటించిన ఆ మహిళ ఆ విషయం వైద్యులకు చెప్పింది. సాంప్రదాయ చైనీస్ విధానం బిగులో ధాన్యాలతో చేసిన ఆహారం తీసుకోవడం నిషేధం. ఆ విధానాన్ని అనుసరించే వారు.. ఆహారం తీసుకోనప్పటికీ ‘క్వి’ అనే జీవశక్తి ద్వారా శరీరం తనను తాను నిలబెట్టుకోగలదని నమ్ముతారు. అయితే ఇటీవలి కాలంలో కొందరు ఆహారం పూర్తిగా మానేసి కేవలం నీరు లేదా కొన్ని సప్లిమెంట్లు తీసుకోవడం చేస్తున్నారు.
అంతేకాదు ఇటీవల కాలంలో కఠిన ఉపవాసాలపై చైనా సోషల్ మీడియాలో వీడియోలు విపరీతంగా పెరిగాయి. బరువు తగ్గడానికి, శరీరాన్ని ‘డిటాక్స్’ చేసేందుకు ఆహారం తినడం మానేయాలని కొంతమంది మిడిమిడి జ్ఞానంతో పోస్టులు పెడుతున్నారు. వాటిని చూసి ఆకర్షితులై అలాంటి డైట్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో చైనాలో తక్కువేం కాదు.
ఆహారం మితంగా తింటే విటమిన్లు, ఖనిజాల లోపం ఏర్పడి నాడీ వ్యవస్థ దెబ్బతినడం, ఎలక్ట్రోలైట్‌ల అసమతుల్యత , అవయవాల పనితీరు దెబ్బతినడం తలెత్తవచ్చని వైద్యులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో అవి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.
ఇటీవల జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఓ మహిళ వారం రోజుల ఉపవాసం తర్వాత 5 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. అయితే ‘ఎనర్జీ పిల్’ తీసుకున్న ఆమె ఆ తర్వాత పేగు సమస్యలు, రక్తంలో ఇన్‌ఫెక్షన్, ప్రమాదకర స్థాయిలో పొటాషియం తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు.