కోవిడ్ మహమ్మారితో సతమతమవుతున్న ఇండియాకు సంఘీభావాన్ని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన కొన్ని గంటలకే ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ.. కోవిడ్ పై భారత్ జరుపుతున్న పోరుకు తాము కూడా సహకరిస్తామని పేర్కొన్నారు. మానవత అన్నదానికి తమ దేశం ప్రాధాన్యమిస్తుందని, భారత ప్రజలకు సంఘీభావంగా తమ దేశం వెంటిలేటర్లు, బై పీఏపీ, డిజిటల్ ఎక్స్ రే మిషన్లు, ఇతర వైద్య పరికరాలు, మందులను అందజేయడానికి సిద్ధంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ‘వీ బిలీవ్ ఇన్ పాలసీ ఆఫ్ హ్యుమానిటీ ఫస్ట్’ అని ఆయన పేర్కొన్నారు. ఇండియాకు ఆపన్న హస్తం అందజేస్తామని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జహీద్ హఫీజ్ చౌదరి తెలిపారు. భారత హెల్త్ కేర్ సిస్టం దెబ్బ తినరాదని భావిస్తున్నామని ఆయన చెప్పారు. సహాయక పరికరాలు, మందుల సత్వర డెలివరీకి ఉభయ దేశాలు సాధ్యమైనంత త్వరగా విధివిధానాలను రూపొందించాలని ఆయన కోరారు. తద్వారా ఇండియాలో కోవిడ్ రోగులకు కూడా శీఘ్రంగా సేవలు అందగలవని ఆశిస్తున్నట్టు చౌదరి పేర్కొన్నారు. ఈ పాండమిక్ వల్ల ఏర్పడిన సవాలును రెండు దేశాలూ ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు.
మరోవైపు పాకిస్తాన్ లోని మానవ హక్కుల సంస్థ ఈధీ ఫౌండేషన్ కూడా 50 అంబులెన్స్ లు, వైద్య సిబ్బందితో వచ్చి సాయం చేస్తామని, ఇండియాలో ప్రవేశించేందుకు అనుమతినివ్వాలని ఇదివరకే కోరింది. మానవాళి ఎదుర్కొంటున్న ఏ ఘోర విపత్తులో నైనా సహాయపడేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సంస్థ చైర్మన్ ఫైసల్ ఈధీ ఇదివరకే పేర్కొన్నారు. ఈ విధమైన సంస్థల సాయాన్ని అందుకునే విషయంలో కేంద్రం జాప్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.