రష్యా పౌరులకు చైనా బంపర్‌ ఆఫర్‌.. ఏడాది పాటు వీసా ఫ్రీ పాలసీ..!

అమెరికా మినహా ప్రపంచంలోని ఇతర అగ్రదేశాల మధ్య బంధం బలపడుతోంది. ట్రంప్‌ టారిఫ్‌ల ఎఫెక్ట్‌తో ఇతర దేశాలు ఒక్కటవుతున్నాయి. రష్యాకు స్నేహ హస్తాన్ని అందిస్తున్న చైనా తాజాగా వీసా ఫ్రీ పాలసీని ఆఫర్‌ చేస్తోంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య టూరిజం డెవలప్‌మెంట్‌కి మరో అడుగు పడినట్టయింది.

రష్యా పౌరులకు చైనా బంపర్‌ ఆఫర్‌.. ఏడాది పాటు వీసా ఫ్రీ పాలసీ..!
Vladmir Putin, Xi Jinping

Updated on: Sep 16, 2025 | 7:25 AM

ప్రపంచంలో అగ్రదేశం అమెరికా అయితే ఆ తర్వాత చైనా, రష్యా దేశాలు కూడా అంతే ప్రాధాన్యత ఉన్న దేశాలు. ఆర్థికంగా, మానవ వనరుల పరంగా ఏ విధంగా చూసినా ఈ రెండు దేశాలు శక్తివంతమైన దేశాలు.. అలాంటి ఈ రెండు దేశాల మధ్య బంధం ఇప్పుడు మరింత బలపడుతోంది. రష్యా ఒకవైపు అమెరికాకు దూరమవుతూ.. చైనాకు దగ్గరవుతోంది. తాజాగా చైనా తీసుకున్న నిర్ణయం ఈ రెండు దేశాల మధ్య ఉన్న బంధాన్ని మరింత ధృఢంగా మారుస్తోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న టారిఫ్‌ల నిర్ణయం వల్ల ఇప్పటికే రష్యా, అమెరికా మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో అమెరికాతో సరిసమానంగా ఎదుగుతోన్న చైనాతో మైత్రి పెంచుకుంటోంది రష్యా. దానికి తగ్గట్టుగానే ఈ సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటోంది చైనా. తాజాగా రష్యాకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఏడాది పాటు రష్యన్లకు చైనా వీసా ఫ్రీ ఎంట్రీని ప్రకటించింది. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 15, 2025 నుంచి సెప్టెంబర్‌ 14, 2026 వరకు అమల్లో ఉంటుంది.

రష్యా నుంచి చైనాకు బిజినెస్‌ పని మీద వచ్చే వారికి, టూరిస్టులకి, తమ స్నేహితులను, బంధువులను కలుసుకునేందుకు వచ్చే వారికి చైనా వీసా ఫ్రీ పాలసీ చాలా వరకు ఉపయోగపడుతుంది. నెలరోజుల పాటు ఎలాంటి ఆంక్షలు లేకుండా రష్యా పౌరులు, చైనాలో పర్యటించవచ్చు. వాళ్లు రష్యా పౌరులు అయి ఉండి, వారి దగ్గర సాధారణ పాస్‌పోర్టు ఉంటే చాలు చైనాలోకి ఎంట్రీ లభిస్తుంది.

చైనా వీసా ఫ్రీ పాలసీ వల్ల ఆ దేశంలో పర్యాటక అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. రష్యా నుంచి భారీగా పర్యాటకులు చైనాలో పర్యటించే అవకాశం ఉంది. దీనివల్ల టూరిజం డెవలప్‌మెంట్‌కి ఇది ఊతం ఇస్తుందని చైనా భావిస్తోంది. ఇటు రష్యా నుంచి చైనాకు వచ్చే వారి సంఖ్య ఈ ఏడాది 45 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ డిమాండ్‌కు తగ్గట్టే విమాన సర్వీసుల సంఖ్యను పెంచుతున్నారు.

మరోవైపు మొదటి బ్యాచ్‌లో 300 మంది రష్యన్లు చైనా వీసా ఫ్రీ పాలసీ ద్వారా ఆ దేశంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాదిలో కొన్ని లక్షల మంది రష్యన్లు చైనాలో పర్యటించే అవకాశం ఉంది. దీనివల్ల ఈ రెండు దేశాల మధ్య టూరిజం డెవలప్‌మెంట్‌తో పాటు వాణిజ్య, ఆర్థిక సంబంధాలు కూడా మెరుగు పడే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒంటెత్తు పోకడతో తీసుకున్న టారిఫ్‌ల నిర్ణయాలతో రష్యా, భారత్‌తో పాటు అనేక ముఖ్యమైన దేశాలతో స్నేహ సంబంధాలను పెంచుకుంటూ సూపర్‌ పవర్‌గా ఎదిగేందుకు అడుగులు వేస్తోంది డ్రాగన్‌ కంట్రీ.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..