
బ్రిక్స్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. అది ఓ చిన్న గ్రూప్ అంటూ విమర్శించారు. ఆ దేశాలు డాలర్‌కు చేటు తెచ్చే కార్యాచరణ మొదలు పెడితే తమ ప్రతాపం చూపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. బిక్స్ కూటమిలో ఉన్న ఏ దైశమైనా 10 శాతం అదనపు సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ మరోసారి హెచ్చరించారు. క్రిప్టో కరెన్సీ చట్టబద్ధతకు సంబంధించిన ‘జీనియస్’ బిల్లుపై సంతకం చేసిన ట్రంప్.. అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘మాతో ఆటలు వద్దు. అమెరికా డాలర్‌కు గ్లోబల్ రిజర్వ్ హోదా ఉంది. దాన్ని ఎప్పటికీ కొనసాగించాల్సిన అవసరం ఉంది. డాలర్ విలువ తగ్గడాన్ని మేం ఎన్నటికీ అంగీకరించబోం. మా కరెన్సీ స్టేటస్ పడిపోతే.. దాన్ని మేం ఓటమిగానే భావిస్తాం’’ అని ట్రంప్ స్పష్టం చేశారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కలిసి బ్రిక్స్ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత అందులో ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేసియా కూడా చేరాయి. ఈ పది దేశాలను కలిపి బ్రిక్స్ ప్లస్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ ఏకపక్ష సుంకాల పెంపుపై ఈ దేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు.. బ్రిక్స్ అనుసరిస్తున్న అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే దేశాలపై 10% అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. బ్రిక్స్ దేశాల పైనా టారిఫ్‌లు ఉంటాయని ప్రకటించారు. ప్రతీకార సుంకాలపై ప్రపంచదేశాల్లో వ్యతిరేకత వస్తున్నా తగ్గేదే లేదంటున్నా.. ట్రంప్ బ్రిక్స్ దేశాలపై కన్నెర్రచేశారు. అమెరికా విధానాలను వ్యతిరేకించే దేశాలపై 10శాతం అదనపు సుంకం తప్పదంటున్నారు.
అయితే ట్రంప్ ఏకపక్ష టారిఫ్‌లను వ్యతిరేకించాయి బ్రిక్స్ దేశాలు. బ్రిక్స్ ప్రకటనపై భారత్ కూడా సంతకం చేసింది. రియో డిక్లరేషన్‌పై రియాక్షయిన ట్రంప్..బ్రిక్స్ దేశాలను వదిలేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచాక గ్లోబల్ ట్రేడ్ వార్ మొదలయ్యింది. ఏప్రిల్‌లో 10 శాతం బేస్ టారిఫ్ రేటుతో చాలా దేశాలకు అదనపు టారిఫ్‌లను ప్రకటించారు. కొన్ని దేశాలపై 50 శాతం వరకు సుంకాలు విధించారు. బ్రిక్స్ దేశాలు అమెరికా సుంకాలను తప్పుపట్టటంతో.. టారిఫ్‌ల విషయంలో ట్రంప్ పంతంమీదున్నారు.