ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే తీవ్ర పరిణామాలు.. చైనా, రష్యాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఆయుధాల సరఫరా అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు సైనిక సహాయం అందించే విషయంలో చైనా, రష్యాలకు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ రెండు దేశాలు టెహ్రాన్‌కు ఆయుధాలు అందించడం లేదని తమకు స్పష్టమైన హామీ ఇచ్చాయని వెల్లడించారు.

ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే తీవ్ర పరిణామాలు.. చైనా, రష్యాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
Trump, Putin, Xi Jinping

Updated on: Jul 25, 2026 | 11:49 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఆయుధాల సరఫరా అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు సైనిక సహాయం అందించే విషయంలో చైనా, రష్యాలకు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ రెండు దేశాలు టెహ్రాన్‌కు ఆయుధాలు అందించడం లేదని తమకు స్పష్టమైన హామీ ఇచ్చాయని వెల్లడించారు. ట్రూత్ సోషల్ వేదికగా చేసిన తాజా పోస్టులో ట్రంప్ ఈ విషయాలను వెల్లడిస్తూ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ మాటకు కట్టుబడి ఉంటారని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇటీవల బీజింగ్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వ్యక్తిగతంగా ఇరాన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయుధాలు ఇవ్వబోమని, విక్రయించబోమని హామీ ఇచ్చారని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అంతేకాకుండా, చైనాకు చెందిన ప్రభుత్వ, రక్షణ రంగానికి సంబంధించిన వాణిజ్య సంస్థలు కూడా ఈ నిర్ణయాన్ని పాటిస్తాయని జిన్‌పింగ్ స్పష్టం చేసినట్లు ట్రంప్ తెలిపారు. తమ మధ్య ఉన్న దౌత్య సంబంధాల దృష్ట్యా ఈ హామీపై పూర్తి నమ్మకం ఉందని ట్రంప్ పేర్కొన్నారు.

అదే విధంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఇరాన్‌కు ఆయుధాల విక్రయం జరగదని తనకు హామీ ఇచ్చారని ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ పుతిన్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు. అలాగే అమెరికా ఉక్రెయిన్‌కు నేరుగా కాకుండా నాటో దేశాలకు మాత్రమే ఆయుధాలను విక్రయిస్తోందన్నారు. ఆ దేశాలు పూర్తి ధర చెల్లించి వాటిని అవసరమైన విధంగా పంపిణీ చేస్తున్నాయని పుతిన్‌కు వివరించినట్లు ట్రంప్ తెలిపారు.

ఇరాన్‌కు చైనా, రష్యా నుంచి సైనిక సహాయం అందుతోందా అనే అంశంపై ఇటీవల అమెరికా నిఘా సంస్థలు సమీక్ష నిర్వహిస్తున్నాయనే వార్తల నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా స్థావరాలపై జరిగిన వరుస దాడుల అనంతరం ఇరాన్‌కు విదేశీ మద్దతు లభిస్తోందా అనే అంశంపై అమెరికా పరిశీలన కొనసాగిస్తున్నప్పటికీ, ప్రస్తుతం బీజింగ్, మాస్కో నుంచి ప్రత్యక్ష సైనిక సహాయం అందుతున్నట్లు ఆధారాలు లేవని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో ఎవరైనా ఈ హామీలను ఉల్లంఘించి ఇరాన్‌కు ఆయుధాలు అందిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

చైనా, రష్యాలతో పరస్పర గౌరవంతో కూడిన దౌత్య సంబంధాలు కొనసాగించాలని తాను ఎప్పటికప్పుడు కోరుకుంటున్నానని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. అయితే ఇరాన్‌కు ఎలాంటి సైనిక మద్దతు అందించినా అది చివరికి ఆ దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలకే నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. అమెరికా, ఇరాన్, చైనా, రష్యా మధ్య సంబంధాలపై ఇవి ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us